ఈవారం టాలీవుడ్ లో కొత్త సినిమాలు సునామీలా వచ్చి పడ్డాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 17 సినిమాలు విడుదలయ్యాయి. టాలీవుడ్ చరిత్రలో ఇదే రికార్డ్. గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, చెప్పాలని ఉంది, ముఖచిత్రం.. ఇలా కొద్దో గొప్పో.... క్రేజ్ ఉన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో ఒకటో, రెండో హిట్ అవుతాయని అంతా ఆశించారు. కానీ విచిత్రమేంటంటే.. 17కి 17 సినిమాలూ ఫ్లాప్ అయ్యాయి.
ఇన్ని సినిమాలు విడుదలైనా... ఒక్కటంటే ఒక్కదానికీ కలక్షన్లు లేవు. ఇన్ని సినిమాలొచ్చినా బాక్సాఫీసు ముందు సందడి లేదు. వచ్చే వారం `అవతార్ 2` వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు న్నాయి. డబ్బింగ్ సినిమా అయినా సరే, తొలి రోజు వసూళ్లు రికార్డు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అయితే అవతార్ తో పాటుగా దాదాపు 10 తెలుగు చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. అవన్నీ అవతార్ సందట్లో నలిగిపోవడం గ్యారెంటీ అనిపిస్తోంది. మళ్లీ తెలుగు సినిమాకి మంచి ఓపెనింగ్స్ కనిపించాలంటే ఈనెల 23 వరకూ ఆగాలి. ఎందుంకంటే, ఆరోజే.. `ధమాకా`, `18 పేజీస్` చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.