సంక్రాంతి సీజన్లో వరుసగా రెండు బ్లాక్ బ్లస్టర్ హిట్లు చూసింది చిత్రసీమ. అప్పటి నుంచి ప్రతీ శుక్రవారం రెండు మూడు సినిమాలైనా వస్తూ,పోయాయి. కానీ వాటిలో ఒక్కటంటే ఒక్క హిట్టూ లేదు. అన్నీ డిజాస్టర్లే. ఆఖరికి రవితేజ, విజయ్‌దేవర కొండ సినిమాలూ అట్టర్ ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. టాలీవుడ్ కి దిష్టి తగిలిందని, ఈ పరాజయాల పరాభవం మరికొన్నాళ్లు తప్పదని భావించారు సినీ విశ్లేషకులు.
అయితే ఈరోజు విడుదలైన `భీష్మ` పరాజయాల పరంపరకు బ్రేక్ ఇచ్చింది. నితిన్ - రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి అన్నిచోట్ల నుంచీ పాజిటీవ్ టాకే వచ్చింది. రివ్యూలూ ఈ సినిమాని భేష్ అంటూ మెచ్చుకున్నాయి. వినోదం, నితిన్ - రష్మికల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవ్వడంతో ఈసినిమా హిట్ జాబితాలో చేరిపోయింది. నితిన్ వరుస ఫ్లాపులకు ఈ సినిమాతో పుల్ స్టాప్ పడినట్టైంది. పైగా ఈమధ్యే నితిన్ నిశ్చితార్థం జరిగింది. సెంటిమెంట్ పరంగా... నితిన్‌కి కలిసొచ్చినట్టే.