కరోనా పుణ్యమా అని షూటింగులకు సెలవులొచ్చాయి. హీరోలు, హీరోయిన్లూ ఎంచక్కా ఇంటికే పరిమితమైపోయారు. దర్శకులు సైలెంట్‌గా ఇంటికొచ్చేశారు. ఎవరి వ్యక్తిగత పనుల్లో వాళ్లు ఉన్నారు. కొంతమంది రిలాక్స్ అవుతున్నారు. ఓ రకంగా ఇలాగైనా సరే, తమ బిజీ షెడ్యూళ్లకు కంత బ్రేక్ దొరికింది. అయితే... కరోనా ఎఫెక్టులన్నీ నిర్మాతలపైనే పడ్డాయి. నొప్పులన్నీ నిర్మాతలవే.
ఇప్పుడు షూటింగులు ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో తెలీదు. మొదలైనా... కాల్షీట్లు ఆ సమయానికి ఎవరెవరి కాల్షీట్లు అందుబాటులో ఉంటాయో చెప్పలేని పరిస్థితి. సినిమా ఇండ్రస్ట్రీలో కాల్షీట్ల ఎడ్జిస్ట్ మెంట్ చాలా ముఖ్యం. దాంతోనే సగం గొడవ. హీరో కాల్షీట్లు దొరికి.. హీరోయిన్‌వి దొరక్కపోతే.. ఓ సమస్య. అందరివీ దొరికి హీరో కాల్షీట్లు దొరక్కపోతే మరింత సమస్య. కొత్త వాళ్లతో సినిమాలు తీసే నిర్మాతలకు ఫర్వాలేదు. అదే బిజీ ఆర్టిస్టులతో తీస్తేనే ఇబ్బంది. వాళ్ల డైరీలన్నీ ఎప్పుడో నిండిపోయి ఉంటాయి. ఇప్పుడు మార్చిలో షూటింగులకు బ్రేక్ ఇచ్చి.. ఏప్రిల్‌లో షూటింగులు మొదలెట్టుకోమని చెప్పినా... కాల్షీట్లు సర్దుబాటు కావడానికి చాలా సమయం పట్టేస్తుంది. ఎందుకంటే సదరు ఆర్టిస్టు ఏప్రిల్ కాల్షీట్లు ఎప్పుడో ఓకే అయిపోయి ఉంటాయి. ముందు ఆ సినిమా పూర్తి చేయాలా, లేదంటే మార్చిలో ఒప్పుకున్న సినిమా పూర్తి చేయాలా అనేది పెద్ద సమస్య.
మార్చి, ఏప్రిల్‌లో కొన్ని సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. కరోనా ఎఫెక్టుతో ఆ సినిమాలు ఆగిపోయాయి. మార్చి కాకపోతే ఏప్రిల్‌లో విడుదల అవుతాయిలే.. అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ లోగా వడ్డీలు పెరిగిపోతాయి. ఎంత పెద్ద నిర్మాత అయినా.. ఫైనాన్స్ లేనిదే సినిమా పూర్తి చేయలేని పరిస్థితి. సినిమా విడుదలైతే. బయ్యర్ల దగ్గర్నుంచి డబ్బులొస్తాయి. దాంతో సెటిల్‌మెంట్లు అయిపోతాయి. ఇప్పుడు సినిమాలు ఆగిపోతే.. ఏ బయ్యరూ నిర్మాతకు నయా పైసా ఇవ్వలేడు.
ముందస్తుగా డబ్బులిచ్చినవాళ్లు కూడా ఆ సొమ్ము వెనక్కి ఇమ్మంటారు. మరోవైపు ఫైనాన్షియర్ల ఒత్తిడి. వాళ్లు వడ్డీల మీద వడ్డీలు పెంచుకుంటూ పోతారు. అనుకున్న డేట్ కంటే ఒక్క నెల సినిమా ఆలస్యమైనా ఆ నెల రోజుల వడ్డీ నిర్మాతపైనే పడుతుంది. ఇవన్నీ నిర్మాతల్ని పట్టి పీడిస్తున్న భయాలు. కరోనా ఎఫెక్ట్ ఎప్పుడు తగ్గుతుందో, ఈ వైరస్ ఎప్పుడు ఎలా ఏ రూపంలో వికృత అవతారం ఎత్తుతుందో తెలీక బిక్కుబిక్కుమంటున్నారు నిర్మాతలు.