గత కొద్ది రోజులుగా పోసాని కృష్ణ మురళినే హాట్ టాపిక్. పవన్ గురించి తాను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రాజకీయ ఉద్దేశ్యంతోనే పవన్ పై పోసానికామెంట్లు చేశారన్నది సుస్పష్టం. ఇద్దరి మధ్యా రాజకీయ వైరం ఉంది. అది ఎవ్వరూ కాదనలేరు. కాకపోతే.. మరీ వ్యక్తిగతంగా దూషించడం మాత్రం సబబు కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎంత కాదన్నా ఇద్దరూ సినిమా వాళ్లే. అది కూడా మర్చిపోయి పోసాని రెచ్చిపోవడం ఎవ్వరికీ మింగుడు పడడం లేదు.
ఈ విషయమై టాలీవుడ్ లోని బడా నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చార్ట. పోసానిని తమ సినిమాల్లోకి తీసుకోవద్దని డిసైడ్ అయ్యార్ట. ముఖ్యంగా మెగా కుటుంబంతో సన్నిహితంగా ఉండే నిర్మాతలంతా ఇదే బాటలో నడబవోతున్నారని టాక్. చిరు, పవన్, చరణ్, బన్నీ, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, శిరీష్... ఇలా మెగా కుటుంబంలో 8మంది హీరోలున్నారు. వీళ్లెవరూ ఇక పై పోసానితో పనిచేయడం దాదాపు అసంభవం.
మిగిలిన చాలామంది హీరోలకు మెగా కుటుంబం అంటే అభిమానం ఉంది. వాళ్లూ పోసానిని దూరం పెట్టొచ్చు. మొత్తానికి.. తన నోటి దురుసు వల్ల నిర్మాతలకు, చిత్రసీమకూ దూరమయ్యే పరిస్థితుల్లో చిక్కుకున్నాడు పోసాని. తను కమ్ బ్యాక్ చేయడం ఇక కష్టమే.