ఈ యేడాదికి ఇంకొన్ని రోజుల్లో శుభం కార్డు పడబోతోంది. 2022లో సూపర్ డూపర్ హిట్ గీతాలెన్నో వచ్చాయి. కొన్ని సినిమాలకు పాటలే... ప్రధాన విజయాస్త్రంగా మారాయి. పాటల కోసమే సినిమాకి వెళ్లిన సందర్భాలు కోకొల్లలు. అలా.. 2022లో కొన్ని పాటలు... ఓ ఊపు ఊపాయి. యూ ట్యూబ్ లో హల్ చల్ చేశాయి. అలా.. ఈ యేడాది అదరగొట్టి.. అత్యధిక వ్యూస్ సొంతం చేసుకొన్న పాటల జాబితాని యూ ట్యూబ్ అధికారికంగా విడుదల చేసింది. వాటిలో `పుష్ప` హవా ఎక్కువగా కనిపిస్తోంది. అల్లు అర్జున్ - సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తిగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇందులోనూ పాటలూ సూపర్ హిట్టయ్యాయి. ఇప్పుడు టాప్ 10లో కూడా సింహభాగాన్ని పుష్ప పాటలే ఆక్రమించాయి.
టాప్ 1గా పుష్పలోని శ్రీవల్లి పాట నిలిచింది. టాప్ 2 స్థానం బీస్ట్ లోని అరబిక్ కుత్తు పాటకు దక్కింది. మూడో పాట..`సామి నా సామి` (పుష్ప) చేజిక్కించుకొంది. కచ్చా బాదం.. టాప్ 4లో ఉంది. పుష్పలోని ఊ అంటావా.. 7వ స్థానంలో ఉంటే, దాని హిందీ వెర్షన్ ఆరోస్థానం దక్కించుకొంది. అంటే టాప్ 10లో నాలుగు పాటలు పుష్ప నుంచి వచ్చినవే. దాన్ని బట్టి `పుష్ప` ఆల్బమ్ ఎంత హిట్టో అర్థం చేసుకోవొచ్చు. 2023లో పుష్ప 2 వస్తోంది. ఈసారి ఇంకెన్ని మంచి పాటలు వస్తాయో చూడాలి.