కొన్ని రోజులుగా త్రిష పేరు.. వార్తల్లో గట్టిగా వినిపిస్తోంది. త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతోందని, త్వరలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరబోతోందని చెన్నై వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. దీనిపై త్రిష అవునని కానీ, కాదని కానీ చెప్పడం లేదు. ఆమె మౌనం... గాసిప్ రాయుళ్లకు మరింత బలాన్ని ఇస్తోంది. త్రిష ముందు నుంచీ కాంగ్రెస్ వాదే. కొంతమంది కాంగ్రెస్ నాయకులతో ఆమెకు మంచి పరిచయాలు ఉన్నాయి. అందుకే త్రిష రాజకీయ ప్రవేశం అనే వార్తలో ఎంతో కొంత నిజం లేకుండా పోలేదు. త్రిష పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిత్రసీమలోకి అడుగుపెట్టి ఇన్నేళ్లయినా తన క్రేజ్ తగ్గలేదు. దాన్ని రాజకీయంగా వాడుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే త్రిష రాజకీయ ప్రయాణం అనుకొన్నంత తేలిక కాదు. ఎందుకంటే... తమిళనాట జాతీయ పార్టీల ప్రభావం అంతగా ఉండదు. అక్కడ ప్రాంతీయ పార్టీలదే హవా. దానికి తోడు.. సినిమా వాళ్ల ప్రభావం రాజకీయాల్లో అంతంత మాత్రమే. ఇది వరకటి రోజులు వేరు. అప్పట్లో సినిమా వాళ్లని దేవుళ్లు గా కొలిచేవారు. వాళ్లు ఏం చేసినా గొప్పగానే ఉండేది. అందుకే జనం వాళ్ల వెంట ఉండేవాళ్లు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. కమల్‌హాసన్, విజయ్‌కాంత్ లాంటి ఉద్దండులే.. బ్యాలెట్ పోరులో బోల్తా కొడుతున్నారు. వాళ్లతో పోలిస్తే త్రిష ఎంత? పైగా త్రిషకు మీడియాతో ఎలా వ్యవహరించాలో తెలీదని అంటుంటారు. తను మీడియాతో కలిసింది కూడా చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో.. రాజకీయాల్లో ఆమె రాణించడం కత్తి మీద సామే. పైగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తిరోగమన దశలో ఉంది.
ఆ పార్టీలో త్రిషకు భవిష్యత్తు ఉందంటే ఎవరూ నమ్మడం లేదు. ఇంత నెగిటివిటీ ఉన్నా.. త్రిష కాంగ్రెస్ లో చేరి, ఎంపీగా పోటీ చేసి, విజయం సాధిస్తే అది కూడా చరిత్రే అవుతుంది.