ప్రముఖ దర్శకుడు లింగు స్వామి చిక్కుల్లో పడ్డారు. ఓ కేసులో కోర్టు లింగుస్వామికీ, అతని సోదరుడు సుభాష్‌కీ ఆరు నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే... పివిపి క్యాపిటల్ అనే సంస్థ నుంచి లింగస్వామి, అతని సోదరుడు కోటి ముప్పై ఐదు లక్షలు అప్పు తీసుకొన్నారు. అయితే ఆ డబ్బులు తిరిగి చెల్లించలేదు. దాంతో విపిపి సంస్థ లింగుస్వామిపై ఒత్తిడి తీసుకొచ్చింది.
డబ్బులు చెల్లించకపోతే... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చివరికి లింగుస్వామి కొన్ని చెక్కులు ఇచ్చారు. చివరికి అవి కూడా బౌన్స్ కావడంతో ఆ సంస్థ లింగస్వామి, సుభాష్ లపై కోర్టుకు వెళ్లారు. ఈ కేసు పరిశీలించిన సైదాపేట్ కోర్టు ఈ ఇద్దరికీ ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. వీళ్లపై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. అయితే లింగు ముందస్తు బెయిల్ అప్లయ్ చేసుకొన్నారు. అంతే కాదు... పై కోర్టుకు అప్పిలుకు వెళ్లనున్నట్లు సమాచారం. తమిళనాట ఒకప్పుడు స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు లింగు స్వామి. ఆ తరవాత.. వరుస ఫ్లాపులతో డౌన్ ఫాల్ లో పడిపోయారు.
ఇటీవల రామ్ తో `ది వారియర్` తెరకెక్కించారు. అది కూడా ఫ్లాప్ అయ్యింది. మరోవైపు ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయి, కోర్టు కేసుల్ని నెత్తిమీద వేసుకొంటున్నారు.