ఆచార్య సినిమా కోసం ముందు త్రిషని ఎంచుకున్న సంగతి తెలిసిందే. కానీ.. `క్రియేటీవ్ డిఫెరెన్సెస్` పేరుతో... ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది త్రిష. ఆ స్థానంలో కాజల్ వచ్చింది. చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చే సినిమా అంటే దానికున్న క్రేజ్ వేరు. పైగా తెలుగులో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ చేసే అవకాశం ఇది. అలాంటి బంగారంలాంటి చాన్స్‌ని త్రిష ఎలా మిస్ చేసుకుందబ్బా? అని అంతా ఆశ్చర్యపోయారు. పారితోషికం విషయంలో పేచీ వచ్చిందని కొందరు, కథలో తన పాత్రకున్న ప్రాధాన్యత తగ్గిందని అలిగిందని ఇంకొందరు మాట్లాడుకున్నారు. నిజానికి త్రిష ఈ సినిమా వదులుకోవడానికి కారణం వేరే ఉందట.
త్రిష ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. మణిరత్నం దర్శకుడు. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్..ఇలా చాలామంది పేరెన్నదగిన నటీనటులు ఇందులో పనిచేస్తున్నారు. త్రిషకి కూడా ఛాన్స్ వచ్చింది. మణిరత్నం సినిమా అంటే తెలిసిందే కదా. భారీ ఎత్తున కాల్షీట్లు కావల్సివస్తుంది. ఇటు చిరు సినిమానీ, అటు మణిరత్నం సినిమానీ ఒకేసారి లాంగించేయాలని చూసిన త్రిషకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఒక సినిమా కావాలంటే మరో సినిమాని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చిరంజీవిది కమర్షియల్ సినిమా. ఎంతకాదన్నా.. హీరో తరవాతే హీరోయిన్ పాత్రకు స్కోప్ ఉంటుంది.
మణిరత్నం సినిమా అలా కాదు. ప్రతి పాత్రకూ న్యాయం జరుగుతుంది. పైగా మణిరత్నం లాంటి దర్శకుడి సినిమాలో నటించడం ఓ బపంర్ ఆఫర్. అందుకే... ఆచార్య సినిమాని వదులుకుని, మణిరత్నం సినిమాని అందుకుంది త్రిష. కానీ బయటకు మాత్రం క్రియేటీవ్ డిఫరెన్సెస్ అని చెప్పింది. అంతే.