పెద్ద సినిమాలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయమూ.. ఆసక్తికరమే. టైటిల్ ఏమిటి? స్టోరీ లైన్ ఏమిటి? ఎవరి పాత్ర ఎలా ఉండబోతోంది? ఇలా చాలా విషయాలపై ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ విషయంలో వీలైనంత వరకూ సీక్రెసీ పాటించి, ఆ ఆసక్తిని రెట్టింపు చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. అన్నీ ముందే చెప్పేస్తే - థియేటర్‌కి వచ్చి చూసే ప్రేక్షకులకు అంతగా మజా ఉండదని అందరి భయం. అయితే ఆచార్య విషయంలో సీన్ రివర్స్ అవుతోంది.
ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన విషయాలు ముందే లీకైపోతున్నాయి. వాటిని వాళ్లూ, వీళ్లూ లీక్ చేయడం కాదు, ఏకంగా మెగాస్టార్ చిరంజీవినే లీక్ చేసేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ఆచార్య అని ముందుగా నోరు జారింది చిరంజీవినే. ఓ సినిమా ఫంక్షన్‌లో ఈటైటిల్ చిరు నోటి నుంచి జారి బయటకు వచ్చేసింది. ఇప్పుడు కొన్ని దిన పత్రికలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు చిరు.
ఈ సందర్భంగా ఆచార్య విషయాలు మరిన్ని బయటకు వస్తున్నాయి. ఈ సినిమాలో తాను మాజీ నక్సలైట్ గా నటిస్తున్నానని, చరణ్ తనకు శిష్యుడిగా కనిపిస్తాడని ఇలా.. కీలకమైన సమాచారాన్ని ముందే అభిమానులకు ఇచ్చేశాడు చిరు. ఇది నిజంగా దర్శకుడు కొరటాల శివని టెన్షన్ పెట్టేదే. సినిమాకి సంబంధించిన కీ పాయింట్స్ హీరోనే చెప్పేస్తే ఎలా అన్నది ఆయన భయం. సినిమా విడుదలకు ఇంకా టైమ్ ఉంది. ఈలోగా చిరు ఇంకెన్ని విషయాలు చెప్పేస్తాడో అని కొరటాల భయపడుతున్నాడట. చిన్నా చితకా హీరో అయితే ఏదో సర్ది చెప్పుకోవచ్చు. `అలా మాట్లాడొద్దు. ఇలా మాట్లాడొద్దు` అని వార్నింగులు ఇచ్చుకోవచ్చు. కానీ మెగాస్టార్‌కి ఎదురెళ్లి ఏం చెప్పగలడు? అందుకే కొరటాల కూడా మౌనంగా ఉండిపోవాల్సివస్తోంది.