వయసు కేవలం అంకె మాత్రమే అని నిరూపిస్తున్న కథానాయికల్లో త్రిష ఒకరు. వయసు పెరుగుతున్నా.. తనలో గ్లామర్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా... తన ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ఇప్పటికీ తన పారితోషికం కోట్లలోనే. ఎప్పుడూ చేతిలో ఏదో ఓ సినిమాతో బిజీగానే ఉంటోంది. తాజాగా త్రిషకు ఓ అరుదైన గౌరవం దక్కింది.
యూఏఈ త్రిషకు `గోల్డెన్ వీసా` అందించింది. గోల్డెన్ వీసా అందుకోవడం.. చాలా అరుదైన సంగతి. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా పొందాలంటే ఎంతో ప్రతిభావంతులై ఉండాలి. ఇది వరకు దుల్కర్ సల్మాన్, గాయని చిత్రలకు మాత్రమే ఈ గౌరవం దక్కింది. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి భారతీయ కథానాయిక త్రిషనే. ఈ అరుదైన సంగతిని సోషల్ మీడియా ద్వారా త్రిష తన అభిమానులతో పంచుకుంది.