జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి... ఇప్పుడు `అల వైకుంఠపురములో`. అల్లు అర్జున్ - త్రివిక్రమ్‌ల మ్యాజిక్ కొనసాగుతూనే ఉంది. మొదటి రెండు సినిమాలూ ఒక ఎత్తు. `అల.. వైకుంఠపురములో` మరో ఎత్తు. ఈ సినిమాతో బన్నీ గత రికార్డులన్నీ బద్దలైపోయాయి. గట్టి పోటీ మధ్య సంక్రాంతికి విడుదలై - బాహుబలి 2 రికార్డుల పక్కన ఠీవీగా నిలబడగలిగింది. ఇదే జోష్ లో మరోసారి కలిసి పనిచేయాలని బన్నీ, త్రివిక్రమ్‌లు డిసైడ్ అయిపోయారు. ఈ సినిమా కూడా గీతా ఆర్ట్స్, హారిక హాసిని కలయికలోనే ఉండబోతోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్. బన్నీ చేతిలో సుకుమార్ సినిమా వుంది. ఇవి పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ - బన్నీ మరోసారి జట్టు కడుతున్నారు. ఈ విషయాన్ని త్రివిక్రమ్, బన్నీలు చూచాయిగా అంగీకరించారు కూడా. ''మేం మళ్లీ కలిసి పనిచేస్తాం. ఈసారి మరో వైవిధ్యభరితమైన కథతో వస్తాం. బన్నీలోని కొత్త కోణం బయటకు తీసుకొచ్చే ప్రయత్నమది'' అని త్రివిక్రమ్ కూడా హింట్ ఇచ్చేశాడు. సో... డబుల్ హ్యాట్రిక్ కోసం బన్నీ ఫ్యాన్స్ రెడీ అయిపోవొచ్చన్నమాట.