సంచుల కొద్దీ పంచులేయడం త్రివిక్రమ్ స్టైల్. తన సినిమా అంటే మాటకో పంచ్ పడాల్సిందే. టీజర్లో, ట్రైలర్లో త్రివిక్రమ్ వేసే లాస్ట్ పంచ్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. అయితే అలాంటి అభిమానులకు 'అరవింద సమేత వీర రాఘవ' కాస్త నిరుత్సాహపరిచింది. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈనెల 11న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.
ట్రైలర్... మంగళవారం విడుదలైంది. అందులో త్రివిక్రమ్ మార్కు పంచ్ డైలాగేదీ కనిపించలేదు. కథకు తగిన ఎమోషన్ డైలాగులకు మాత్రం కొదవలేకుండా పోయింది. ఫ్యాక్షనిజం గురించి, 'మాట విలువ' గురించి త్రివిక్రమ్ చెప్పిన డైలాగులు బాగా నచ్చేశాయ్. చివర్లో ఏదైనా పంచ్ పడుతుందంటే... అక్కడ కూడా ఎమోషనల్ డైలాగ్‌తో ముగించాడు మాటల మాంత్రికుడు. ట్రైలర్‌లోనే కాదు. సినిమాలోనూ పంచ్‌లకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదట త్రివిక్రమ్.
మరీ ముఖ్యంగా సెకండాఫ్ అంతా ఎమోషనల్ టచ్‌తో సాగుతుందని, యాక్షన్ ఘట్టాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలుస్తోంది. తొలి సగంలో ఎన్టీఆర్ - పూజా హెడ్డేల మధ్య సాగే లవ్ ట్రాక్ మాత్రం నవ్విస్తుందని, సునీల్ అక్కడక్కడ తనదైన శైలిలో వినోదం పంచుతాడని, మిగిలిన సినిమా అంతా సీరియెస్‌గా సాగుతుందని తెలుస్తోంది.
త్రివిక్రమ్ సినిమా అంటే హాయైన వినోదం అనుకున్న వాళ్లకు ఇంత సీరియస్ ఎమోషన్ ఏమాత్రం ఎక్కుతుందో చూడాలి.