విజయ్ దేవరకొండ.. ఈ పేరు అతి తక్కువ కాలంలోనే అత్యంత పాపులర్‌గా మారిపోయింది. విజయ్ దేవరకొండ ఇప్పుడు ఓ వ్యక్తి మాత్రమే కాదు, 'బ్రాండ్' కూడా. 'రౌడీస్' అంటూ అభిమానుల్ని ముద్దుగా పిలుచుకునే విజయ్ దేవరకొండ, తన కొత్త సినిమా 'నోటా' రిలీజ్‌కి ముందు సోషల్ మీడియా అభిమానుల్ని ఉద్దేశించి ఓ ఇంట్రెస్టింగ్ అప్పీల్ చేశాడు.
అదేంటంటే, సోషల్ మీడియాలో మనకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడినా దానిని పట్టించుకోవద్దని అభిమానులకు సూచించడం. నిజంగానే ఇది గ్రేట్ అప్పీల్. 'నోటా' సినిమా ఈ నెల 5వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నెల 11న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ రెండు సినిమాల మధ్యా 'ఫైట్' అంటూ పెద్ద చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. ఎన్టీఆర్‌ని విజయ్ టార్గెట్ చేశాడన్న ప్రచారం నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులకీ, విజయ్ దేవరకొండ అభిమానులకీ మధ్య ఫైట్ నడుస్తోంది. ఆ ఫైట్‌కి ముగింపు పలికేందుకే విజయ్ దేవరకొండ 'రౌడీ లవ్స్' అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.
చేసే పనిలో నిజాయితీ గురించి మాత్రమే ఆలోచిస్తాననీ, ఇతరత్రా విషయాల్ని పట్టించుకోననీ, ఎవర్నీ ద్వేషించడం తనకు తెలియదనీ, తనను అభిమానించేవారూ అలాగే వుండాలని విజయ్ దేవరకొండ తన అభిమానులకు పిలుపునిచ్చాడు. నిజానికి, టాలీవుడ్‌లో హీరోలంతా ఇదే అభిప్రాయంతో వుంటారు. అభిమానులకి ఎన్నిసార్లు ఈ విషయమై అప్పీల్ చేసినా వారిలో మార్పు రావడంలేదు.
గతంలో చాలామంది పెద్ద హీరోల అభిమానుల మధ్య గొడవలు జరిగాయి. ఆయా హీరోలు తమ అభిమానులకు క్లాసులు కూడా తీసుకున్నారు. కానీ, విజయ్ కొంచెం డిఫరెంట్‌గా కన్పిస్తున్నాడు. అతని ఫాలోవర్స్ కూడా డిఫరెంట్‌గానే ఆలోచిస్తారు కాబట్టి, 'వార్ ఆఫ్ వర్డ్స్' సోషల్ మీడియాలో అభిమానుల మధ్య తగ్గుతుందని ఆశిద్దాం.