త్రివిక్రమ్‌కీ, పవన్ కల్యాణ్‌కీ ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరూ మంచి మిత్రులు. పవన్‌కి త్రివిక్రమ్ కేర్ టేకర్‌గా ఉంటున్నాడు. పవన్ ఓ కథ ఓకే చేయాలంటే.. ముందు త్రివిక్రమ్‌కి వినిపించాలి. ఆయన ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. ఈమధ్య పవన్ ఏ రీమేకు చేయాలన్నా... దానికి త్రివిక్రమ్ పెన్ను సాయం చేయక తప్పడం లేదు. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయ సీతమ్ సినిమాకీ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, సంభాషణలు అందిస్తున్నాడు. భీమ్లా నాయక్ లానే, ఈ సినిమాకీ తానే కర్త, కర్మ, క్రియ.
అయితే.. పవన్ సినిమా విషయంలో త్రివిక్రమ్ జోక్యం చేసుకోవడం మహేష్‌బాబుకి నచ్చడం లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఎందుకంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్నాడు. పవన్ సినిమా బిజీలో పడిపోవడం వల్ల, తన సినిమాని పట్టించుకోవడం మానేశాడన్నది మహేష్ బాధ. భీమ్లా నాయక్ సమయంలోనూ ఇదే జరిగింది. అప్పటికి సరిగ్గా మహేష్ సినిమాని పట్టాలెక్కించాల్సిన సమయం. ఆ టైమ్ అంతా భీమ్లా నాయక్‌కి కేటాయించాడు త్రివిక్రమ్. దాంతో మహేష్ సినిమా ఆలస్యమైంది. ఆ తరవాత కథ మార్చాల్సివచ్చిందనుకోండి. అది వేరే విషయం. ఇప్పుడు పవన్ సినిమాలో వేలు పెట్టడం వల్ల, తన సినిమా ఆలస్యం అవుతుందని మహేష్ ఫీలవుతున్నాడు. త్రివిక్రమ్ సినిమా అయిపోతే, రాజమౌళి ప్రాజెక్టుతో బిజీ అవ్వొచ్చన్నది మహేష్ ఉద్దేశం. అయితే.. త్రివిక్రమ్ అందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు అనేక కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు మరింత డిలే అయ్యే ప్రమాదంలో పడింది.