ఈ సంక్రాంతి పండగ... సినిమాలతో మరింత గ్లామరస్‌గా మారబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వాటిలో అందరి దృష్టీ... 'గుంటూరు కారం'పైనే. ఈ సంక్రాంతికి బాక్సాఫీసు రికార్డులు కొల్లగొట్టే స్టామినా ఈ సినిమాకే ఉందన్నది అందరి నమ్మకం. మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌పై అభిమానులకు ఆ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మహేష్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎలా చూపిస్తాడా? అని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ కూడా బయటకు వచ్చేసింది.
టైటిల్‌కి తగ్గట్టుగానే ట్రైలర్ అంతా ఘాటు ఘాటుగా ఉంది. ముఖ్యంగా రమణ పాత్రలో మహేష్ స్వాగ్ అదిరిపోయింది. మహేష్ డైలాగ్ డెలివరీ, బీడీ కాల్చే స్టైల్ ఇవన్నీ ఫ్యాన్స్ కు నచ్చేశాయి. తమ హీరోని అభిమానులు ఎలా చూడాలనుకొంటున్నారో, త్రివిక్రమ్ అలానే ఆవిష్కరించాడు. అక్కడి వరకూ ఓకే. కానీ... ఈ ట్రైలర్ అన్ని వర్గాలకూ, అందరికీ నచ్చుతోందా? త్రివిక్రమ్ స్టైల్ లో ఉందా? అంటే సరైన సమాధానాలు దొరకవు.
ఓ ట్రైలర్ చూడగానే ఆ సినిమా కథపై ఓ అవగాహన రావాలి. కథలో సంఘర్షణ అర్థం అవ్వాలి. కానీ 'గుంటూరు కారం'లో అవేం కనిపించలేదు. బిట్లు బిట్లుగా చూస్తుంటే ఇది కూడా బాగానే ఉందే... అనుకొంటాం కానీ, ఓవరాల్ గా సంతృప్తి దొరకదు. పైగా త్రివిక్రమ్ స్థాయిలో గుర్తు పెట్టుకోదగిన డైలాగ్ ఒక్కటీ వినిపించలేదు. దాంతో... ఫ్యాన్స్ లో కాస్త కలవరం మొదలైంది. యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై ట్రోల్స్ మొదలెట్టారు. 'అజ్ఞాతవాసి 2'లా ఉందని, సర్కారు వారి పాట చూస్తున్నట్టే ఉందని కామెంట్స్ విసురుతున్నారు. మరి... ఫైనల్ రిజల్ట్ ఏం ఉంటుందో.