మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాతో సంక్రాతి బరిలోకి రానున్నారు. నెక్స్ట్ అల్లు అర్జున్ తో ఒక మూవీ అనౌన్స్ చేశారు. బన్నీ పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అందుకనే బన్నీ కోసం వెయిట్ చేయకుండా, ఇంకో మూవీ పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారు త్రివిక్రమ్. ఎప్పుడూ పవన్, మహేష్, బన్నీలతోనే మార్చి మార్చి సినిమాలు చేసే త్రివిక్రమ్ మధ్యలో నితిన్,ఎన్టీఆర్ లతో ఒక్కో సినిమా తీశారు.
ఇప్పుడు మళ్ళీ తన కంఫర్ట్ జోన్ లోంచి బయటికి వచ్చి తన నెక్స్ట్ మూవీ కోసం వెంకటేష్ తో చర్చలు జరిపినట్టు టాక్. వెంకీ సూపర్ హిట్ మూవీస్ ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ లకు త్రివిక్రమ్ మాటల మాయాజాలం ఉందన్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో వెంకీ, త్రివిక్రమ్ సినిమా చేయాలని ప్రేక్షకుల కోరిక. ఇన్నాళ్ళకి ఆ కోరిక నెరవేరనుంది.
త్రివిక్రమ్, వెంకీ కోసం ఒక ఫ్యామిలీ డ్రామాని రాసుకున్నారని, అయితే దీనిని మల్టీస్టారర్ గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. వెంకీతో పాటు నాచురల్ స్టార్ నాని కూడా ఇందులో కనిపించనున్నారట. కథని ఫైనల్ చేసి, వీరిద్దరితో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించి పనిలో ఉన్నారని టాక్. త్వరలోనే అఫీషియల్ గా ప్రకటించే అవకాశముంది. త్రివిక్రమ్, వెంకీ, నాని ఈ క్రేజ్ కాంబినేషన్ పై అప్పుడే అంతా ఆసక్తి చూపిస్తున్నారు.