'అల వైకుంఠపురములో' సినిమా సూపర్ సక్సెస్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. అయన నెక్స్ట్ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసిన గురూజీ నటీనటులు, టెక్నిషియన్ల ఎంపికపై దృష్టి సారించారట. ఈ సినిమాలో హీరోయిన్ గా ఓ బాలీవుడ్ భామను తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. మొదట్లో ఈ సినిమాకు పూజా హెగ్డేని ఎంచుకునే ఆలోచనలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే 'అరవింద సమేత', 'అల వైకుంఠపురములో' సినిమాలలో పూజ హీరోయిన్ గా నటించింది. రెండూ హిట్లే కావడంతో సెంటిమెంట్ గా పూజను ఫైనలైజ్ చేసే ఆలోచన ఉందని చెప్పారు. కానీ అదేమీ నిజం కాదట.
కియారా అద్వాని లాంటి పాపులర్ బాలీవుడ్ భామ అయితే హిందీ వెర్షన్ రిలీజ్ చేయలానుకుంటే ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. అలా చేయకపోయినా డబ్బింగ్ వెర్షన్ కు డిమాండ్ పెరుగుతుందని ఫిక్స్ అయ్యారట. త్వరలోనే హీరోయిన్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారట.