ఈతరం రచయితల్లో త్రివిక్రమ్ ఓ లెజెండ్ అనే చెప్పుకోవాలి. రచయితలకు స్టార్ హోదా తీసుకొచ్చి, వాళ్ల ఇమేజ్ పెంచినవాడు త్రివిక్రమ్. రచన ద్వారా కోట్లు సంపాదించడం ఎలాగో నేర్పిన వాడు త్రివిక్రమ్. మాటల రచయితగా త్రివిక్రమ్ కోటి రూపాయలు తీసుకోవడం అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పటికీ అలాంటి సంచలనాలు త్రివిక్రమ్ సృష్టిస్తూనే ఉన్నాడు. దర్శకుడిగా బిజీ అయ్యాక... మరో సినిమా కోసం కలం పట్టుకోలేదు త్రివిక్రమ్. కాకపోతే... `తీన్ మార్` సమయంలో మిత్రుడు పవన్ కల్యాణ్ కసం మరోసారి మాటల రచయితగా మారాడు. అప్పట్లో త్రివిక్రమ్ అత్యంత భారీ పారితోషికం అందుకున్నాడని సమాచారం. ఇప్పుడూ అంతే. `అప్పయ్యయుమ్ కోషియమ్` కోసం త్రివిక్రమ్ మరోసారి మాటల రచయితగా మారాడు.
ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కి 10 కోట్లు పారితోషికం ఇస్తున్నారన్న వార్త టాలీవుడ్ అంతటా సంచనలం సృష్టిస్తోంది. అంతే కాదు.. ఈ సినిమా లాభాలలో ఆయనకు 50 శాతం వాటా కూడా ఇస్తున్నార్ట. ఓ రచయితకి ఇంత స్థాయిలో పారితోషికం ఇవ్వడం.. బహుశా టాలీవుడ్ చరిత్రలోనే ఇదే తొలిసారేమో..? అయితే ఈ సినిమాకి త్రివిక్రమ్ రచయిత మాత్రమే కాదు. కర్త కర్మ క్రియ కూడా. ఈ ప్రాజెక్టులోకి పవన్ ని తీసుకొచ్చింది ఆయనే. అసలు ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా ఆయనదే. అందుకే త్రివిక్రమ్ కి ఇంత డిమాండ్.