ఏ ముహూర్తంలో మహేష్ బాబు - త్రివిక్రమ్ ల సినిమా ప్రకటించారో, అప్పటి నుంచీ ఈ సినిమాకి అన్నీ సమస్యలే. ఈ సినిమాకి సంబంధించిన ఏ పనీ ఓ పట్టాల తెమలడం లేదు. దానికి తోడు బోలెడన్ని గాసిప్పులు. ఇటీవల ఈ సినిమాకి క్లాప్ కొట్టారు. తొలి షెడ్యూల్ లో ఓ ఫైటు కూడా తెరకెక్కించారు. అయితే ఆ ఫైట్ సరిగా రాలేదని, ఫైట్ మాస్టర్ల మీద అటు త్రివిక్రమ్ ఇటు మహేష్ అలిగారని వార్తలొచ్చాయి. ఫైట్ తరవాత... టాకీ మొదలవ్వాలి. ఇప్పటి వరకూ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మహేష్మాత్రం ఈ సినిమాని వదిలేసి... ఫారెన్ టూర్లు చుట్టొస్తున్నాడు.
ఈ సినిమా స్క్రిప్టు ఇంకా సెట్ అవ్వలేదని. కథ విషయంలో మహేష్ అడిగిన డౌట్లని త్రివిక్రమ్ క్లియర్ చేయలేకపోతున్నాడని, ఫుల్ స్క్రిప్టు ఇస్తే తప్ప... సెట్ కి రానని మహేష్ ఖరాఖండీగా చెప్పేశాడని, అందుకే ఈ సినిమా ఆలస్యమైందని టాక్. త్రివిక్రమ్ స్వతహాగా రచయిత. తనొక్కడే కూర్చుని స్క్రిప్టు రాసుకొంటాడు. అలాంటి త్రివిక్రమ్... ఇప్పుడు కథపై, డైలాగులపై ఫోకస్ చేయలేకపోతున్నాడని టాక్. త్రివిక్రమ్ కి ఇతర వ్యాపపాలు ఎక్కువైపోయాయని, అందుకే తన సొంత సినిమాపై దృష్టి పెట్టలేకపోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే సినిమాల లావాదేవీలన్నీ త్రివిక్రమ్ స్వయంగా చూసుకొంటున్నాడు. సితారలో ఓకే అయిన కథల్ని తాను దగ్గరుండి రిపేర్లు చేస్తున్నాడు. పవన్ సినిమాకి సంబంధించినంత వరకూ వెనుక ఉండి నడిపించేది త్రివిక్రమే. ఇన్ని పనులు పెట్టుకొని... సొంత స్క్రిప్టు రాసుకోలేకపోతున్నాడట త్రివిక్రమ్. అందుకే ఈ సినిమా విషయంలో ముందడుగు పడడం లేదు.