ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాల్లో వారసుడు ఒకటి. విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు రూపొందించిన చిత్రమిది. ఈ సినిమాపై దాదాపుగా రూ.200 కోట్లు ఖర్చు పెట్టాడు దిల్ రాజు. షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. మరోవైపు బిజినెస్ కూడా మొదలైపోయింది. ఓవర్సీస్ లో ఈ సినిమా దాదాపుగా రూ.38 కోట్లకు అమ్ముడుపోయినట్టు టాక్. తమిళ సినిమాలకు సంబంధించినంత వరకూ ఇదో రికార్డ్! రజనీకాంత్ సినిమా దర్బార్ రూ.35 కోట్లకు అమ్మారు. ఆ రికార్డుని ఇప్పుడు విజయ్ సినిమా బద్దలుకొట్టింది.
ఈమధ్య తమిళ సినిమాలు ఓవర్సీస్ లో పెద్దగా ఆడడం లేదు. విజయ్ సినిమాలకూ అక్కడ గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. రజనీకాంత్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉండేది. అది కూడా డల్ గానే ఉందిప్పుడు. అయినా సరే.. `వారసుడు`ని రూ.35 కోట్లకు కొనేశారు బయ్యర్లు. ఏపీ, తెలంగాణలోనూ ఈ సినిమాని మంచి రేట్లకే అమ్మాలని దిల్ రాజు భావిస్తున్నాడు. నైజాంలో ఎలాగూ తన చేతుల్లోనే ఉంటుంది. మరోవైపు తమిళ నాట ఈ సినిమాకి దాదాపుగా రూ.150 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉంది. ఎలా చూసుకొన్నా... దిల్ రాజుకి `వారసుడు` లాభాల్ని తీసుకురావడం ఖాయంగా అనిపిస్తోంది.