ఈ మధ్య ఎన్టీఆర్ సినిమాల్లో ఎనర్జీ కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది. అందుకు కారణం బరువైన పాత్రలు ఎంచుకోవడమే. 'టెంపర్' సినిమా నుండీ ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. అయితే ఈ కొత్త బాడీ లాంగ్వేజ్‌తో ఎన్టీఆర్ దక్కించుకున్న విజయాలే ఘనం. ఈ విషయంలో సందేహం లేదు. అయితే ఎన్టీఆర్ నుండి అభిమానులు, ఆడియన్స్ కాస్త ఫన్, కూసింత ఎంటర్‌టైన్‌మెంట్ కూడా కోరుకుంటున్నారట. 'టెంపర్'లో హైపర్ యాక్టివ్‌గా కనిపిస్తాడు కానీ, సీరియస్ మూడ్‌లోనే ఉంటాడు. అలాగే 'నాన్నకు ప్రేమతో' సినిమాలో పూర్తిగా సీరియస్ మూడ్.
ఆ తర్వాత వచ్చిన 'జనతా గ్యారేజ్' కూడా అంతే, బరువైన పాత్ర కావడంతో అక్కడ కూడా ఎన్టీఆర్ ఫన్ చూపించే అవసరం రాకపోయింది. ఆ తర్వాత వచ్చిన 'జై లవకుశ'లోని రెండు పాత్రలు కాస్త ఎంటర్‌టైన్ చేసినా, 'జై' పాత్ర మాత్రం సీరియస్‌గానే ఉంటుంది. అయితే ఈ ఈ పాత్రల్లో అక్కడక్కడా ఎన్టీఆర్ ఎంటర్‌టైన్ చేసినా, అందులో పెద్దగా కొత్తదనమేమీ కనిపించదు. అయితే తాజాగా ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చాలా ఫన్నీగా ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతోందట. ఫుల్ జోష్‌తో ఎన్టీఆర్ పాత్ర ఉండేలా డిజైన్ చేశారట.
అదే సమయంలో ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు, యాక్షన్ ఘట్టాలు కూడా డిఫరెంట్‌గా డిజైన్ చేశారట. 'అజ్ఞాతవాసి' ఎఫెక్ట్‌తో త్రివిక్రమ్ ఇంకోసారి స్క్రిప్టుపై రీ వర్క్ చేశాడట. పాటలు, డైలాగులు, యాక్షన్, కామెడీ ఇలా అన్ని విషయాల్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. రేపట్నుంచి సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. పూజా హెగ్దే, ఎన్టీఆర్‌తో జోడీ కడుతోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.