ప్రేమించుకొనే కొత్తలో అంతా బాగానే ఉంటుంది. మైనస్సులు కూడా ప్లస్సులుగా కనిపిస్తుంటాయి. కానీ ఏళ్లు గడిచే కొద్ది బలహీనతలు అర్థం అవుతాయి. వీళ్లు మనకు కరెక్టేనా? అనే అనుమానాలు వెంటాడతాయి. కానీ అప్పటికే కమిట్ అయిపోవడం వల్ల సర్దుకుపోవడమో, లేదంటే.. బ్రేకప్ చెప్పేసి, మరో పార్టనర్‌ని వెదుక్కోవడమో జరిగిపోతాయి. ఇలాంటివన్నీ చాలా సహజమైన పరిణామాలు. అలాంటి ఓ ప్రేమకథని అత్యంత వాస్తవిక కోణంలో ఆవిష్కరిస్తే ఎలా ఉంటుందో 'ట్రూ లవర్' సినిమాలో చూపిస్తున్నారు. నిజానికి 'లవర్' అనే ఓ తమిళ చిత్రానికి ఇది అనువాద రూపం. తెలుగులో ఈ సినిమా పోస్టరుపై మారుతి, ఎస్‌కేఎన్ లాంటి పేర్లు ఉండడం వల్ల తెలుగులోనూ మంచి బజ్ ఏర్పడింది. వీళ్ల కాంబోలో 'బేబీ' వచ్చింది. అలాంటి సినిమా అయ్యే లక్షణాలు ఇందులో ఉన్నాయి. టీజర్ ఆకట్టుకొంది. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది.
ఆరేళ్ల పాటు ప్రేమించుకొన్న ఇద్దరు బ్రేకప్ చెప్పుకొన్న తరవాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయో ఈ కథలో చూపిస్తున్నారు. ఓ ఫెయిల్యూర్ లవర్ కథ ఇది. సన్నివేశాలు, సందర్భాలు, సంభాషణలు అన్నీ సహజంగా అనిపిస్తున్నాయి. విఫల ప్రేమకథల్లో పెయిన్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని సరిగా చూపించగలిగితే కుర్రకారుకు నచ్చేస్తుంది. అమ్మాయిలపై, వాళ్ల ప్రేమలపై సెటైర్లు వేయగల సందర్భాలు ఈ సినిమాలో చాలా ఉన్నట్టే కనిపిస్తున్నాయి. ట్రైలర్‌తో యూత్ ని థియేటర్లకు రప్పించగల కంటెంట్ ఇందులో ఉంది. తెలిసిన నటీనటులు ఉంటే ఇంకా బాగుండేది. ఈనెల 10న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.