ఓ సినిమాకి కావల్సింది స్టార్ బలం కాదు, కథా బలం. సరైన కథా, కథనాలు లేకపోయినా, ప్రమోషన్ల పరంగా అశ్రద్ద చేసినా.. సినిమా ఫలితాలు తారు మారు అవుతాయి.
సమంత తాజా చిత్రం 'యూటర్న్ ఇందుకు ఉదాహరణ. ఈ సినిమాకి మంచి బజ్ వచ్చింది, రివ్యూలూ బాగానే అనిపించాయి. కానీ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లేదు. 'ఇలాంటి థ్రిల్లర్లు చాలా చూశాం' అంటూ లైట్ తీసుకున్నారు. సమంత క్రేజ్ కూడా థియేటర్లకు రప్పించలేకపోయింది. దానికి తోడు ప్రచారం సరిగా లేకపోవడం కూడా 'యూటర్న్' వసూళ్లని దెబ్బకొట్టింది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.6.5 కోట్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాలు లెక్కకట్టాయి. సినిమా ఏమో.. దాదాపు రూ.10 కోట్లకు అమ్ముకున్నారు. ఓ విధంగా నిర్మాతలు లాభపడినా.. పంపిణీదారులకు మాత్రం నష్టాలు తప్పలేదు. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకి వసూళ్లు లేకపోవడం బయ్యర్లను బాగా ఆశ్చర్యపరిచింది.
'యూటర్న్'తో పాటు శైలజారెడ్డి అల్లుడు ఒకేసారి విడుదల అవ్వడం ఈ వసూళ్లపై ప్రభావం చూపించింది. అలా టాక్ బాగున్నా - కలక్షన్లు లేని చిత్రాల్లో 'యూటర్న్' కూడా చేరిపోయింది.