'ఖైదీ నెంబర్ 150' సినిమా అమెరికాలో వసూళ్ళ పరంగా వీర కుమ్ముడు కుమ్మేస్తోంది. ఓ మాస్ సినిమాకి ఓవర్సీస్‌లో ఈ స్థాయిలో వసూళ్ళు రావడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2.6 మిలియన్ల డాలర్లు ఇప్పటిదాకా 'ఖైదీ' సొంతం చేసుకుంది. అలాగే 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమా కూడా వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తోంది అమెరికాలో. 'శాతకర్ణి' ప్రస్తుతానికి 1.57 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. దిల్ రాజు నిర్మించిన 'శతమానం భవతి' సినిమా తక్కువేం తిన్లేదు. 0.64 మిలియన్ డాలర్లను కొల్లగొట్టి సత్తా చాటింది. ఈ మూడు సినిమాలతో ఈ సంక్రాంతిని అమెరికాలోని తెలుగు సినీ ప్రేక్షకులూ పండగ చేసుకున్నారు. తెలుగు సినిమాలు అమెరికాలో ఇంతలా వసూళ్లు కొల్లగొట్టడం అనేది అందర్నీ ఆశ్వర్యపరుస్తోంది. ఈ సారి అమెరికాలో ఈ సినిమాలతో తెలుగు ప్రేక్షకులు అచ్చమైన సంక్రాంతిని జరుపుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. మూడు సినిమాలు మూడు డిఫరెంట్ జోనర్స్‌లో ఉండడమే ఇందుక ఓ కారణంగా చెప్పొచ్చు. చిరంజీవి సినిమా ఆల్ ఎలిమెంట్స్‌తో క్లాసీ టచ్ ఉన్న మాస్ ఎంటర్‌టైనింగ్ సినిమాగా అలరిస్తుండగా, బాలయ్య 'శాతకర్ణి'తో తెలుగు వారికి తెలుగుతనం గురించి చాటి చెబుతున్నారు. ఇకపోతే చిన్న హీరో అయిన శర్వానంద్ 'శతమానం భవతి' అక్కడ మన తెలుగు వారికి సంక్రాంతి వాతావరణాన్ని అచ్చంగా తెరపై కళ్లకి కట్టినట్లుగా చూపిస్తోంది. ఈ రకంగా ఈ మూడు సినిమాలు అక్కడ వసూళ్ల జోరు కొనసాగిస్తున్నాయి.