ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో.. `కల్యాణం కమనీయం` ఒకటి. సంతోష్ శోభన్ కథానాయకుడు. తనని పక్కన పెడితే... పేరున్నవాళ్లెవరూ ఈ సినిమాలో లేరు.
పెద్ద సినిమాల పోటీలో.. ఈ సినిమాని పట్టించుకొనే ఛాన్సే లేదు. కాకపోతే.. ఇది యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చిన సినిమా. ప్రభాస్ తో భారీ బడ్జెట్ సినిమాల్ని అందించి, టాలీవుడ్ లో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది యూవీ. అందుకే... యూవీపై అందరికీ నమ్మకం. ఇన్ని పెద్ద సినిమాలతో `కల్యాణం కమనీయం` పోటీ పడుతోందంటే.. కచ్చితంగా సినిమాలో విషయం ఉంటుందన్న భరోసా ప్రేక్షకులకు, సీనీ అభిమానులకు ఉంటుంది. కానీ.. ఈనెల 14న విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. డబ్బింగ్ బొమ్మ `తెగింపు`కి వచ్చిన వసూళ్లు కూడా ఈ సినిమాకి రాలేదు. కనీసం ఓపెనింగ్స్ కూడా లేవు. అప్పటికే విడుదలైన వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య హిట్ జాబితాలో చేరిపోవడం, 14నే వారసుడు విడుదల కావడం వల్ల.. శోభన్ సినిమా పూర్తిగా నలిగిపోయింది. సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదిది. అందులోనూ ఇంత పోటీలో విడుదల చేయడం పెద్ద రిస్క్. ఆ రిస్క్ తీసుకొన్న యూవీ పూర్తిగా బోల్తా పడింది. అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే.. ఈ సినిమాతో యూవీకి పోయిందేం లేదు. ఎందుకంటే.. డిజిటల్, శాటిలైట్ రూపంలో.. మంచి మొత్తమే రాబట్టింది.
విడుదలకు ముందే ఓటీటీకి అమ్మేయడం ప్లస్ పాయింట్. వాటి వల్ల... యూవీ కాస్త సేఫ్ అయిపోయింది. కాకపోతే... సంతోష్ శోభన్ కే వరుసగా ఇది రెండో డిజాస్టర్.