మొన్నటికి మొన్న'వాల్మీకి' విడుదలకు ముందు సమస్యల్లో చిక్కుకుంది. బోయ వర్గానికి చెందిన కొంతమంది ఈ సినిమా టైటిల్‌ని వ్యతిరేకించారు. దాంతో చివరి క్షణాల్లో టైటిల్ మార్చి సినిమాని విడుదల చేయాల్సివచ్చింది. ఇప్పుడు 'సైరా - నరసింహారెడ్డి'కీ ఇలాంటి సమస్యలే ఎదురవుతున్నాయి. ఈ సినిమా విషయంలో మాకు అన్యాయం జరిగిందని, ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా తమని మోసం చేశారని చిరంజీవి, రామ్‌చరణ్‌లపై ఓ వర్గం కోర్టుకి ఎక్కిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు హై కోర్టులో మరో పిటీషన్ దాఖలు అయ్యింది. ఈ సినిమా విడుదలకు ముందే.. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు చూపించాలని, వాళ్ల అనుమతి తీసుకున్న తరవాతే విడుదల చేయాలని హైకోర్టులో ఓ వాజ్యం దాఖలు అయ్యింది. ఈ పిటీషన్‌పై న్యాయస్థానం విచారణ కు శ్రీకారం చుట్టింది. తీర్పుని మాత్రం ప్రకటించకుండా వాయిదా వేసింది.
అయితే విడుదలకు ముందుగా ఈసినిమాని ఉయ్యాలవాడ వంశీకులకు చూపించడానికి సైరా బృందానికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలుస్తోంది. అయితే.. ఈ సినిమా చూశాక... ఎవరైనా అభ్యంతరం చెబితే విడుదలకు ముందు సమస్యలు ఎదుర్కోవాల్సివస్తుంది. అందుకే 'సైరా' టీమ్ మొత్తం టెన్షన్‌లో పడింది. మరి ఈ వ్యవహారం ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.