తెలుగువాళ్లు గర్వించదగ్గ నటుడు ప్రభాస్. బాహుబలిలో తన బాహుబలీయమైన నటనతో జాతీయ, అంతర్జాతీయ అభిమానుల్ని కూడా పొందగలిగాడు. డార్లింగ్ గా పిలవబడుతూ అందర్నీ డార్లింగ్ అని పిలిచే ప్రభాస్ మనసు కూడా డార్లింగే అని అంటారు తనను దగ్గరగా చూసినవారు. ఈ మధ్యన జరిగిన ఒక సంఘటన ఈ విషయాన్ని మరింత బలపరుస్తోంది. అదేమిటో చూద్దాం. ఒక సినిమా ఆఫీసులో సినీ ప్రముఖులు పేకాట ఆడారు. ఆ ఆటలో ప్రభాస్ కూడా ఉన్నాడు. అదేమి జూదరేఖో తెలియదు గానీ షోలు మీద షోలు ఆడి భారీ మొత్తంలో గెలుచుకున్నాడు. తనతో ఆడే వాళ్ళు కూడా కుబేరులే. అందుకే ఆ కాసేపు ఆటలో ప్రభాస్ గెలుచుకున్నది అక్షరాలా రూ. 5 లక్షలు.
తెరమీద హీరో అయిన ప్రభాస్ పేకాటలోనూ హీరోయే అని అందరూ పొగిడారట. అప్పుడే మన ప్రభాస్ లోని డార్లింగ్ హార్ట్ బయటికొచ్చింది. ఆ ఆఫీసులో పని చేస్తున్న పనిమనిషిని, వంట చేసే వ్యక్తిని, టీలు అందించే ఆఫీస్ బాయ్ ని, బయట కాపలా కాస్తున్న వాచ్ మ్యాన్లని, ఆఫీస్ డ్రైవర్లని లోపలికి పిలిపించాడట. అందరూ లోపలికొచ్చాక లెక్కేస్తే 10 మంది ఉన్నారట. అంతే, ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున అందరికీ పంచేశాడట. అప్పటికప్పుడు రూ.50,000 చేతికొచ్చిన ఆ దిగువ మధ్య తరగతి వ్యక్తులకి ఎలా స్పందించాలో తెలియక కన్నీళ్లు పెట్టుకున్నారట.
ప్రభాస్ కి అసలు వారు ఎవరో, వారి సమస్యలు ఏమిటో ఏవీ తెలియదు. కానీ ఆ డబ్బు అందుకున్న ప్రతి వారికి ఆ డబ్బుతో సమాధానం చెప్పాల్సిన సమస్యలు ఉన్నాయని మర్నాడు వారి మాటల ద్వారా తెలుసుకున్న వ్యక్తులు వివరిస్తూ ఈ విషయం బయట పెట్టారు. 1000/- విరాళం ఇచ్చి పేపర్లో ఫోటోలు, సోషల్ మీడియాలో ప్రచారాలు కోరుకునే కోటీశ్వరులు ఉన్న ఈ కాలంలో 5 లక్షల రూపాయల్ని 5 నిమిషాల్లో ఇచ్చేసి సైలెంటుగా వెళ్లిపోయాడంటే ప్రభాస్ ని ఏమనాలి? డార్లింగ్ అని కాక!