ఉప్పెనతో ఘనమైన ఎంట్రీ ఇచ్చాడు మెగా హీరో వైష్ణవ్ తేజ్. ఇప్పుడు తన చేతి నిండా సినిమాలే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైష్ణవ్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఫృథ్వీ అనే కొత్త కుర్రాడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కథ ఇప్పటికే లాక్ అయిపోయింది తెలుస్తోంది. ఇదో స్పోర్ట్స్ డ్రామా అని, హాకీ నేపథ్యంలో సాగే కథ అని, వైష్ణవ్ హాకీ ఆటగాడిగా కనిపించబోతున్నాడని సమాచారం.
ఈ సినిమా కోసం వైష్ణవ్ హాకీ లో శిక్షణ పొందుతున్నాడట. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమా ఉండబోతోందని, బడ్జెట్ కూడా భారీగా కేటాయించారని తెలుస్తోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే సినిమాలకు మంచి గిరాకీ ఉంటుందన్నది వాస్తవం. అయితే తెలుగులో హాకీ నేపథ్యంలో సాగే సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కలేదు. ఇటీవల విడుదలైన `ఏ 1 ఎక్స్‌ప్రెస్` ఫ్లాప్ అయ్యింది. మరి... ఈసారి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.