కథానాయికల్లో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే బ్యాచ్ ఎక్కువగా కనిపిస్తుంది. డిమాండ్ ని బాగా క్యాష్ చేసుకుని, బ్యాంకు బెలెన్సులు పెంచుకోవడానికే ఎక్కువ మొగ్గు చూపిస్తుంటారు. అందుకే వచ్చిన ప్రతీ అవకాశాన్నీ ఎడా పెడా ఒప్పేసుకుంటారు. కొంతమంది మాత్రం ఇందుకు భిన్నం. పాత్ర నచ్చితేనే చేస్తారు. పారితోషికం ఎంత ఇచ్చినా.. తమకు నచ్చని సినిమాల్ని చేయరు. స్టార్ హీరో పక్కన నటించే ఛాన్సు వచ్చినా.. వదులుకుంటారు. అలాంటి వాళ్లలో.. సాయి పల్లవి ఒకరు.
టాలీవుడ్ లోని బిజీ కథానాయికల్లో సాయి పల్లవి పేరు కూడా ఉంటుంది. గత మూడేళ్ళలో సాయి పల్లవి నాలుగు సినిమాలని వదులుకుందట. వాటిలో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ఒకటి. సాయి పల్లవి రిజెక్ట్ చేసిన తరవాతే ఆ పాత్ర రష్మిక దగ్గరకు వెళ్లింది. ‘సరిలేరు నీకెవ్వరు’ లోకూడా మొదట సాయిపల్లవినే హీరోయిన్ గా అనుకున్నారట. ఆ పాత్ర మళ్లీ రష్మికని వరించింది. అయ్యప్పనుమ్ కోషియం కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సినిమాల్లో ఉంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చేయబోతున్న `కర్ణన్` రీమేక్ కోసం సాయి పల్లవిని సంప్రదిస్తే నో చెప్పిందని టాక్.