ఉప్పెనతో... తొలి అడుగులోనే సూపర్ సక్సెస్ కొట్టాడు వైష్ణవ్ తేజ్. ఓ కుర్ర హీరోకి అది పర్‌ఫెక్ట్ డెబ్యూ. ఒక్క సినిమాతో దర్శక నిర్మాతల దృష్టిలో పడిపోయాడు. ఇంకో హిట్టు కొడితే - మెగా యూత్ హీరోల్లో స్టార్ డమ్ తనకే కట్టబెట్టేవారు. అయితే.. ఆ తరువాతి సినిమా `కొండ పొలెం` దారుణంగా బెడసి కొట్టింది. క్రిష్ లాంటి దర్శకుడ్ని నమ్మి పప్పులో కాలేశాడు వైష్ణవ్. అయితే నటుడిగా మాత్రం తనకి పాస్ మార్కులు దక్కాయి. సినిమా ఫెయిల్ అయినా.. ఆ ప్రభావం పెద్దగా పడలేదు.
మూడో సినిమా `రంగ రంగ వైభవంగా` ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గిరీశాయ దర్శకత్వం వహించిన సినిమా ఇది. భారీ అంచనాలతో వచ్చిన ఈ ప్రేమకథ.. అట్టర్ ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. మెగా హీరో అనే ట్యాగ్ లైన్ కూడా ఈసినిమాని కాపాడలేకపోయింది. కనీసం ఈ సినిమాని ఓపెనింగ్స్ కూడా దక్కకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
రొటీన్ ప్రేమకథ, అత్యంత పేలవమైన స్క్రీన్ ప్లేతో.... ఈ సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. కనీసం నటుడిగానూ... వైష్ణవ్ లోని ప్లస్ పాయింట్స్‌ని ఈ సినిమా బయటకు తీసుకురాలేకపోయింది. ఇది వైష్ణవ్‌కి వరుసగా రెండో ఫ్లాప్. కొండపొలెం ఫ్లాప్ వల్ల.. వైష్ణవ్ కెరీర్ తారుమారు అవ్వలేదు గానీ, ఈ ఫ్లాప్ తో మాత్రం గట్టిదెబ్బ తగిలేసింది. ఎందుకంటే ఓ హీరో ప్రతిభను.. హిట్లూ, ఫ్లాపులతో బేరీజు వేసే కాలం ఇది. ఇంతకాలం వైష్ణవ్ డేట్ల కోసం తిరిగిన దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆ ప్రయత్నాలు మానుకొంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.