ఈ లాక్ డౌన్ సమయంలో అమేజాన్ ప్రైమ్‌కి దెబ్బ మీద దెబ్బ పడింది. అమేజాన్ లో విడుదలైన పెంగ్విన్, వి, నిశ్శబ్దం సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ సినిమాలపై కోట్లు వెచ్చించిన అమేజాన్ - దానికి తగిన రాబడి లేకపోవడంతో బెంబేలెత్తిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమా అంటేనే భయపడిపోతోంది. కొన్నాళ్ల పాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉండాలని అమేజాన్ నిర్ణయం తీసుకుందని సమాచారం.
అయితే.. అమేజాన్ కన్ను ఇప్పుడు పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్`పై పడింది. ఈ సినిమా హక్కుల్ని ఎలాగైనా సరే, చేజిక్కించుకుని నష్టాల్ని పూడ్చుకోవాలని ఆలోచిస్తోంది. అందుకే దిల్ రాజుపై అమేజాన్ ఒత్తిడి తీసుకొస్తోందని టాక్. మీ `వి` సినిమా కొని నష్టపోయాం.. అందుకే - వకీల్ సాబ్ సినిమానైనా ఇవ్వండి అంటూ డీల్ కోసం తాపత్రయపడుతోందని టాక్. ఇది వరకే ఈ సినిమాకి వంద కోట్లకు కొనడానికి అమేజాన్ ముందుకొచ్చిందని సమాచారం. కానీ అప్పట్లో దిల్ రాజు ఈ డీల్ కి ఒప్పుకోలేదు.
ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తామని తేల్చేశారు. అయితే ఈ సినిమాని థియేటర్లో విడుదలైనా - ఓటీటీ హక్కులు మాత్రం తమకే ఇవ్వాలని అమేజాన్ డిమాండ్ చేస్తోందట. అలాగైనా `వి` నష్టాల్ని భర్తీ చేసుకోవచ్చన్నది అమేజాన్ ప్లాన్. ఎలాగూ `వకీల్ సాబ్` సినిమాని ఓటీటీకి ఇవ్వాల్సిందే. ఇది వరకు దిల్ రాజు సినిమాల్లో చాలా వరకూ అమేజాన్ కే వెళ్లాయి. ఇప్పుడు `వకీల్ సాబ్` కూడా అమేజాన్‌కి వెళ్లడం ఖాయంగా అనిపిస్తోంది. కాకపోతే.. వి - థియేటర్లో విడుదల కాలేదు. కానీ వకీల్ సాబ్ మాత్రం ముందుగా థియేటర్లో విడుదలై.. ఆ తరవాత అమేజాన్ చేతికి వెళ్తుంది.