పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా వకీల్ సాబ్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ అంచనాలతో విడుదలైంది. అందుకు తగ్గట్టే.. మంచి టాక్ సంపాదించుకుంది. తొలి మూడు రోజుల వసూళ్లూ కుమ్మేసింది. ఇక రికార్డులు ఖాయమనుకుంటున్న దశలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించి, ఆ ఆశలకు గండి కొట్టింది. తెలంగాణలో థియేటర్లుమూసేయడం, ఆంధ్రాలో అర కొర తెరచుకోవడంతో.. వసూళ్లు భారీగా పడిపోయాయి. కుటుంబ ప్రేక్షకులు వస్తారనుకుంటున్న సమయంలో కరోనా మరింత భయపెట్టడంతో.. ప్రేక్షకులు కరవయ్యారు.
ఓ దశలో భారీ నష్టాలు తప్పవనుకుంటే, ఇప్పుడు స్వల్ప నష్టాలతో గట్టెక్కినట్టు టాక్. నైజాం, విశాఖలలో దిల్ రాజు ఈ సినిమాని స్వయంగా విడుదల చేసుకున్నారు. నైజాంలో మార్జిన్ దాటేసింది. విశాఖ కూడా కాస్త అటూ ఇటూ వచ్చింది. ఈస్ట్,వెస్ట్‌లలో బయ్యర్లు లాభాలు పొందారు. మిగిలిన చోట్ల... స్వల్ప నష్టాలొచ్చాయి. తొలి మూడు రోజులూ భారీ వసూళ్లు సాధించబట్టి సరిపోయింది. లేదంటే.. కథ వేరేలా ఉండేది. ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వకపోవడంతో.. వకీల్ సాబ్ వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపించింది. లేదంటే.. అన్ని చోట్లా ఈ సినిమా లాభాల బాట పట్టేదే.