ఈ వేసవి సీజన్ ని `వకీల్ సాబ్` ప్రారంభించబోతున్నాడు. ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సీజన్‌లో విడుదల కాబోయే పెద్ద సినిమా ఇదే కాబట్టి అందరి దృష్టీ `వకీల్ సాబ్`పైనే ఉంది. దిల్ రాజు ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. బయ్యర్లూ భారీ రేట్లకు ఈ సినిమాని కొనేశారు. ఇప్పుడు రికవరీ ఎలా అన్నదే పెద్ద సమస్యగా మారింది. అందుకే.. బెనిఫిట్ షోలూ, ఫ్యాన్స్ షోల పేరుతో.. ప్రత్యేక షోలు ప్లాన్ చేసి, దాంతో గిట్టుబాటు చేసుకుందామని బయ్యర్ల ఆలోచన.
8వ తేదీ అర్థరాత్రి నుంచి `వకీల్ సాబ్` షోలు ప్రారంభం కానున్నాయని సమాచారం. అర్థరాత్రి షోకలు టికెట్ రేటు రూ.1500 గా ఫిక్స్ చేశారని టాక్. విశాఖ, హైదరాబాద్ నగరాలలో ఈ బెనిఫిట్ షోలు ఉండబోతున్నాయి. అలానే 9వ తేదీ తెల్లవారుఝామున కూడా ఈస్ట్,వెస్ట్, ఉత్తరాంధ్రలలో కొన్ని షోలు వేయబోతున్నార్ట.
దానికి టికెట్ రూ.500 గా నిర్ణయించారని టాక్. ఇలా బెనిఫిట్ షోలూ, ఫ్యాన్స్ షోల పేరుతో తొలి రోజే భారీగా వసూళ్లు రాబట్టాలని చూస్తున్నారు. ఏపీ తెలంగాణలలో టికెట్ రేటు పెంచుకునే సౌలభ్యం ఉంది. కాబట్టి.. టికెట్ రూ.200 గా నిర్ణయిస్తే, తొలి మూడు రోజుల్లోనే మాక్సిమం రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు. టికెట్ రేటు ఎంతున్నా పవన్ ఫ్యాన్స్ కొనడానికి రెడీనే. మరి సామాన్యుడి మాటేమిటో? తనకి `వకీల్ సాబ్` అందరి ద్రాక్షానేనా?