రాజకీయాల కారణంగా ‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఎట్టకేలకు ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్న విషయం విదితమే. అయితే, కరోనా వైరస్.. పవన్ కళ్యాణ్ స్పీడుకి బ్రేకులేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగి వుంటే, మే నెలలో ‘వకీల్ సాబ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేదే. నిజానికి సినిమా షూటింగ్ చాలా వేగంగా జరిగింది. మిగిలిన ‘కొంత’ పార్ట్ చిత్రీకరణ జరిగితే సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. అయితే, ఇంతవరకు పవన్ సరసన ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారన్నదానిపై స్పష్టత లేదు. హీరోయిన్ ఎంపిక విషయంలో మొదటి నుంచీ ఓ ఖచ్చితమైన అవగాహనతో వుందట ‘వకీల్ సాబ్’ టీమ్. తక్కువ నిడివి మాత్రమే ఆ పాత్రకి వుండడమే అందుకు కారణమట.
ఇదిలా వుంటే, ‘వకీల్ సాబ్’ సినిమా కోసం చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ‘పింక్’ రీమేక్ అయిన ‘వకీల్ సాబ్’ని పవన్ ఇమేజ్‌కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులతో రూపొందిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ పాత్రకి కొంత ప్రాధాన్యత ఏర్పడిందని అంటున్నారు. అయినాగానీ, రెగ్యులర్ సినిమా హీరోయిన్‌తో పోల్చితే, ఇందులో హీరోయిన్ పాత్రకి స్కోప్ తక్కువే. చాలా తక్కువ రోజులు హీరోయిన్‌తో షూటింగ్ చేస్తే సరిపోతుందట. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే, శరవేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసేసి, వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చేస్తారని సమాచారవ్‌ు. హీరోయిన్ ఎంపిక కూడా ఈ లాక్‌డౌన్ పూర్తయ్యే లోపే కొలిక్కి వస్తుందని తెలుస్తోంది.