మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగానే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి అడుగు పెట్టారు. చిరంజీవి కారణంగానే నాగబాబూ సినిమాలు చేశారు. కానీ, ఆ ‘మెగా’ ట్యాగ్ అనేది వాళ్ళు తగిలించుకుంటే వచ్చింది కాదు. ఆ మాటకొస్తే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు సినీ పరిశ్రమలో. పవన్ కళ్యాణ్ విషయానికొస్తే, అన్నయ్యను మించిన తమ్ముడు.. అనే స్థాయికి ఎదిగాడు సినీ పరిశ్రమలో. అది తనకు గర్వకారణమని చిరంజీవి కూడా పలు సందర్భాల్లో చెప్పారు.
పవన్ ఏనాడూ తన సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడానికి అత్యుత్సాహం చూపలేదు. ఇది అందరికీ తెల్సిన విషయమే. తనతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు పోటీ పడినా, పవన్ ఆచి తూచి సినిమాలు చేశారు తప్ప ‘నెంబర్’ మీద ఎప్పుడూ ఆయన ఫోకస్ పెట్టింది లేదు. ఇదంతా ఎందుకంటే, రాజకీయ విమర్శల్లో భాగంగా, ‘చిరంజీవి తమ్ముళ్ళు కాకపోయి వుంటే..’ అంటూ ఓ పొలిటికల్ లీడర్, పవన్ మీద నీఛమైన కామెంట్స్ చేశారు. దాంతో, నాగబాబు స్పందించక తప్పలేదు. సినిమాలు తమకు జీవనాధారమని నాగబాబు చెప్పింది ముమ్మాటికీ వాస్తవం. నాగబాబు, సినిమాల్లో నటించారు.. నటిస్తూనే వున్నారు. సినిమాల్ని నిర్మించారు. బుల్లితెరపైనా నటుడిగా కన్పించారు. బుల్లితెరపై ఓ కామెడీ షోకి హోస్ట్‌గా వ్యవహరించారు, వ్యవహరిస్తున్నారు కూడా. సినిమా జనాలపైన రాజకీయ విమర్శలు చేయడం సులభం. కానీ, సినీ పరిశ్రమకు చెందిన చాలామంది రాజకీయాల్లో సత్తా చాటారు. ఆ సినిమా గ్లామర్ కోసం రాజకీయ పార్టీలు వెంపర్లాడటం కూడా చూస్తూనే వున్నాం.