దిగ్గజ గాయని వాణీ జయరామ్ హఠాన్మరణం.. ఆమె అభిమానులను సంగీత ప్రియులను విస్మయ పరిచింది. ఈ మృతిపై అనుమనాలు ఉన్నాయని చెన్నై పోలీసులు చెప్పడం మరింత కలవరపాటుకు గురి చేసింది. వాణీ జయరామ్ చెన్నైలోని తన ఇంట్లో శవమై కనిపించడం, తలకు బలమైన గాయం తగలడం.. పోలీసులకు అనుమానాలు రేకెత్తించాయి.
దీనిపై చెన్నై పోలీసులు తక్షణమే దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం అంతా చెన్నైలోని వాణీ జయరామ్ ఇంటిని తీక్షణంగా పరిశీలించారు. జాగిలాలను, ఫోరెన్సిక్ నిపుణులనూ పిలిపించారు. అయితే.. పోలీసులకు ఎలాంటి కీలకమైన ఆధారాలూ లభించలేదని తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజీలోనూ అనుమానాస్పద కదలికలు కనిపించలేదు. దాంతో.. ఇది సహజమరణమే అని దాదాపుగా నిర్దారణకు వచ్చారు. కాలుజారి కిందపడడం వల్ల తలకు బలమైన గాయం తగిలి ఉంటుందని, దాంతో ఆమె మరణించారని ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు. పోస్టు మార్టమ్ రిపోర్టులో ఏముంది? అక్కడా ఆమెది సహజమరణంగా తేల్చారా? అనే విషయాలు తెలియాల్సివుంది. భర్త మరణం తరవాత... వాణీ జయరామ్ ఒంటరిగా ఉంటున్నారు. ఇంట్లో ఓ పనిమనిషి కూడా ఉంది. వీరిద్దరూ తప్ప.. ఆ ఇంట్లో ఎవరూ లేరు. వాణీ జయరామ్ కి పిల్లలు లేకపోవడంతో... బంధువులే ఆమె అంత్యక్రియలు పూర్తి చేశారు.