సినిమా అనేది వినోద మాధ్యమం. అందరినీ నవ్వించడానికో, ఆలోచింపచేయడానికో సినిమాలు తీస్తారు. అయితే.. కొన్నికొన్నిసార్లు ఆ ప్రయత్నాలు వివాదాస్పదం అవుతుంటాయి. జై భీమ్ చుట్టూ అలాంటి ఓ వివాదం రాజుకుంది. నిజ జీవిత ఘటనల నేపథ్యంలో సూర్య తెరకెక్కించిన చిత్రం జై భీమ్. ఈ సినిమాకి వచ్చిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. ఈ దశాబ్దపు గొప్ప చిత్రంగా విశ్లేషకులు జై భీమ్ ని పొగిడేస్తున్నారు.
అయితే ఓ వర్గానికి మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చలేదు. ఈ సినిమా తమ ప్రతిష్టని దిగజార్చే విధంగా ఉందని పన్నియార్ సంఘం మండిపడిపోతోంది. ఈ సినిమాలోని అమాయకుల్ని జైలులో వేసి ఇబ్బంది పెట్టే పోలీస్ అధికారి పేరు.. పన్నియర్ వర్గానికి చెందింది. అందుకే ఈ గొడవంతా. అందుకే పన్నియార్ సంఘం జ్యోతికకు, సూర్యకూ నోటీసులు పంపింది. అంతేకాదు.. సూర్యపై దాడి చేసినవాళ్లకు లక్ష రూపాయల బహుమంతి అందిస్తామని ప్రకటన చేసింది. దాంతో. సూర్య ఇంటి చుట్టూ భద్రత మోహరించారు.
చెన్నై టీ నగర్ లో సూర్య నివాసం ఉంది. ఆ ఇంటి చుట్టూ సాయుధ పోలీసుల్ని మోహరించింది ప్రభుత్వం. వాళ్లతో పాటుగా సూర్య వ్యక్తిగత సిబ్బంది కూడా ఇంటికి కాపలాగా ఉన్నారు. ఈ విషయమై సూర్య పోలీసుల్ని ఆశ్రయించబోతున్నాడని టాక్. ఓ వ్యక్తిపై దాడి చేయమని, బహిరంగంగా ఆఫర్ ఇవ్వడం దారుణమే కదా?