ఈమధ్య సౌత్ సినిమాలు బాక్సాఫీసు దగ్గర శివ తాండవం ఆడేస్తున్నాయి. ఆ లిస్టులో కాంతార కూడా చేరిపోయిది. ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం సాధించి, అన్ని రికార్డుల్నీ బద్దలు కొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు దాదాపుగా రూ.200 కోట్ల వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమాపై ఇప్పుడు కాపీ మరక పడింది. ఈ సినిమాలోని వరాహ రూపం అనే గీతం కాపీ అంటూ మలయాళంకు చెందిన 'తైక్కుడం బ్రిడ్జ్' మ్యూజిక్ బ్యాండ్ ఆరోపణలు చేశారు. 'నవరసం అనే పాటని కాపీ చేసి ఈ ట్యూన్ సృష్టించారని, ఆ పాటని సినిమా నుంచి వెంటనే తొలగించాల్సిందే అంటూ 'తైక్కుడం బ్రిడ్జ్' మ్యూజిక్ బ్యాండ్ కోర్టుని ఆశ్రయింయింది. దీనిపై విచారణ చేపట్టిన కేరళ కోర్టు ఇప్పుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
మలయాళంలోని థియేటర్లతో పాటు ఇతర స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలో 'వరాహ రూపం' పాటను వాడకూడదంటూ కేరళ కోజికోడ్ సెషన్స్ కోర్టు 'కాంతార' నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది. కాంతార సినిమా మొత్తానికి క్లైమాక్స్ సీనే హైలెట్. ఆ సీన్ పండడానికి వరాహ రూపం అనే పాట.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యింది. ఇప్పుడు ఆ పాట తొలగిస్తే.. క్లైమాక్స్ లోని కిక్ మొత్తం పోతుంది.
కాకపోతే... ఇప్పటికే.. `కాంతార` ఫైనల్ రన్‌కి వచ్చేసింది. ఈసినిమాని అందరూ చూసేశారు. దాంతో ఈ సినిమాకి కొత్తగా వచ్చే నష్టమైతే ఉండదు. కాకపోతే.. ఓటీటీకి వచ్చేసరికి ఈ పాట లేకపోతే ఆ ఎమోషన్ క్యారీ అవ్వడం కష్టం. దాంతో పాటు... ఇంత గొప్ప విజయం సాధించిన సినిమాపై కాపీ మరక అలా ఉండిపోతుంది. అదొక్కటే బాధాకరం.