ఈ సంక్రాంతికి చిరు, బాలయ్య సినిమాలతో పోటీ పడ్డాడు దిల్ రాజు. తన వారసుడు సినిమాని.. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డిలకు పోటీగా విడుదల చేశాడు. పైగా తమిళనాట 11న విడుదల చేస్తే.. తెలుగులో 14న వచ్చింది. ఈ విషయంలో దిల్ రాజు పెద్ద రిస్క్ తీసుకొంటున్నాడని, తేడా వస్తే... భారీ నష్టం తప్పదని ట్రేడ్ వర్గాలు ముందు నుంచీ.. చెబుతూనే వచ్చాయి. ఇప్పుడు అదే నిజం అయ్యింది. తమిళంలో ఈ సినిమా జస్ట్ యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. కాకపోతే.. అక్కడ విజయ్ కి ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా.. వసూళ్లు బాగానే వచ్చాయి.
కానీ తెలుగులో ఆ పరిస్థితి లేదు. విజయ్ సినిమా అంటే లైట్ తీసుకొంటారు. పైగా తమిళంలో యావరేజ్ అని ముందే తెలిసిపోయింది. దానికి తోడు... చిరు, బాలయ్య సినిమాలు వసూళ్లు కుమ్ముకొన్నాయి. ఈ నేపథ్యంలో.. వారసుడు విడుదలైంది. తొలి రోజు రూ.3.5 కోట్లు దక్కించుకొన్న వారసుడు... రెండో రోజు మరో 2.75 కోట్లు రాబట్టుకొంది. ఈ వసూళ్లు నిలకడగా ఉంటే వారసుడు కాస్త తేరుకొన్నట్టే లెక్క. కాకపోతే... తెలుగులో ఈ సినిమా కనీసం రూ.25 కోట్లు రాబట్టాలి. లేకపోతే దిల్ రాజు లెక్కలన్నీ తప్పినట్టే. ఆ ఛాన్స్ వారసుడుకి లేనట్టే కనిపిస్తోంది.