సినిమా టైటిల్స్‌లో తమ పేరుకి ముందే ఏదో ఒక 'బిరుదు' ఉండాలని చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకూ అనుకోవడం సహజమే. ఎక్కువగా దక్షిణాది సినీ పరిశ్రమల్లోనే ఇది కనిపిస్తుంటుంది. అది తప్పేమీ కాదు, అభిమానుల్ని ఎట్రాక్ట్ చేయడానికి, వారిని ఆనందింపజేయడానికి అలా చేస్తుంటారు. అయితే తనను 'మెగా ప్రిన్స్' అని అందరూ అంటోంటే ఇబ్బందికరంగా ఉంటుందని మనసులో మాట బయటపెట్టాడు మెగా హీరో వరుణ్ తేజ. 'మిస్టర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ యంగ్ హీరో, బాలీవుడ్‌లో హీరోలకు అలాంటి గుర్తింపులు ఉండవనీ, ఉన్నా వాటిని వారు పట్టించుకోరని చెప్పాడు. బిరుదులు బాధ్యతల్ని పెంచేస్తాయని అందుకే వాటి పట్ల కొంచెం ఇబ్బందికరంగా ఫీలవుతుంటానని వరుణ్ అన్నాడు. కొన్ని సినిమాలు చేశాక హీరోగా స్టామినా ప్రూవ్ అయ్యాక బిరుదులు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం కరెక్టే. కానీ అభిమానులు తమ అభిమాన హీరోకి ఏదో ఒక బిరుదు ఇచ్చేయకుండా ఉండరు. వాటిని దర్శక నిర్మాతలూ ఫాలో అయిపోతుంటారు. ఒక్కోసారి దర్శక నిర్మాతలే తమ తమ సినిమాల్లోని హీరోలకి బిరుదులిచ్చేయడం కూడా చూస్తూనే ఉంటాం. ఏదేమైనప్పటికీ మెగా ప్రిన్స్ అని తనకున్న బిరుదుని ఇబ్బందికరంగా ఫీలవుతుండడమే కాకుండా దాన్ని బయటపెట్టినందుకు మెగా ప్రిన్స్‌ని గట్స్ ఉన్నోడే అనుకోవాలి. అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టడం, తద్వారా ఇతరుల మనసుల్ని నొప్పించకపోవడమంటే లౌక్యం తెలియాలి. అది బాగానే ఉంది మెగా ప్రిన్స్‌కి.