మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి వెంకీతో మల్టీ స్టారర్. ఈ సినిమాకి 'ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్' అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే రెండో సినిమా యంగ్ డైరెక్టర్ సంకల్ప్‌రెడ్డితో చేస్తున్నాడు. ఇదో ప్రత్యేకమైన ప్రయోగాత్మక చిత్రం. స్పేస్ నేపథ్యంలో తెరకెక్కుతోందీ చిత్రం. కాగా ఈ సినిమాకి 'అంతరిక్షం' అనే టైటిల్‌ని అనుకుంటున్నారట.
కథా, కథనాల నేపథ్యంలో ఈ సినిమాకి ఈ టైటిల్ అయితే బావుంటుందని సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోందట. అయితే కథా నేపథ్యానికి తగ్గట్లుగా మరికొన్ని టైటిల్స్‌ని పరిశీలిస్తున్నారట. ప్రస్తుతానికి 'అంతరిక్షం' టైటిల్ పట్ల అంతా ఆశక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. సబ్‌మెరీన్ నేపథ్యంలో 'ఘాజీ' అనే టైటిల్‌తో సినిమా తెరకెక్కించి, మంచి విజయం అందుకోవడంతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు సంకల్ప్ రెడ్డి. అలాంటి సంకల్ప్ రెడ్డి నుండి మరో సినిమా వస్తుందంటే అది ఖచ్చితంగా అంచనాలను టార్గెట్ చేస్తుంది.
అందులోనూ మెగా కాంపౌండ్ హీరోతో ఈ క్రియేటివ్ డైరెక్టర్ తెరకెక్కించబోయే సినిమా అంటే ఆ అంచనాలు వంద రెట్లయ్యాయి. ఈ సినిమాలో వరుణ్ 'ఆస్ట్రోనాట్'గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకంగా శిక్షణ పొందాడు. జీరో గ్రావిటీలో అంతరిక్షంలో ఉన్నట్లుగా తన నటన ఎలా ఉండాలి. అనే దానిపై ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతో పాటు, ఫిజిక్ విషయంలో కూడా కొన్ని కసరత్తులు చేశాడట.
ప్రస్తుతం హైద్రాబాద్ శివార్లలో అంతరిక్షాన్ని తలపించేలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో వరుణ్‌కి జోడీగా అదితీరావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు.