బాలకృష్ణ సినిమా అంటే యాక్షన్, మాస్ మసాలా. దానికి పొలిటికల్ టచ్ ఇవ్వడం కంపల్సరీ. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన లెజెండ్ ని ఓసారి గుర్తు చేసుకోండి. తెలుగు దేశం పార్టీకి సపోర్ట్ గా... ఇతర రాజకీయ పార్టీలను దుయ్యబడుతూ డైలాగులు పేలాయి. సీటు కాదు కదా.. అసెంబ్లీ గేటు కూడా దాట నివ్వను.. అనే డైలాగ్ అయితే అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఇంతకు ముందు కూడా బాలయ్య సినిమాల్లో పొలిటికల్ పంచ్‌లు తరచూ పేలేవి.
ఈ సంక్రాంతికి రాబోతున్న 'వీర సింహారెడ్డి'లో సైతం ఆ తరహా డైలాగులు ఉన్నాయట. రాజకీయాలకు సంబంధించిన పదునైన సంభాషణలకు ఈ సినిమాలో చోటిచ్చారని వినికిడి. ముఖ్యంగా ఉచిత పథకాలపై బాలయ్య ఓ రేంజ్‌లో సైటర్లు వేశాడని, ఆ సీన్... థియేటర్లో ప్రకంపనలు సృష్టించబోతోందని ఇన్ సైడ్ వర్గాల టాక్. పాలన అంటే ఎలా ఉండాలి? అనే పాయింట్ పై బాలయ్య దాదాపు మూడు పేజీల డైలాగ్ చెప్పాడని.. ఈ డైలాగ్, సీన్ సినిమాకే హైలెట్ కాబోతోందని తెలుస్తోంది. ఏపీలో జగన్ ప్రభుత్వం 'ఆల్ ఫ్రీ' మంత్రం జపిస్తున్న సంగతి తెలిసిందే. ఉచిత పధకాలతో ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతోందని ఆర్థిక నిపుణులు కూడా గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య పలికే సంభాషణలు.. సూటిగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా ఉంటాయని సమాచారం. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. ఆ పాత్ర తీరు తెన్నులు కూడా షాకింగ్ గా ఉంటాయని సమాచారం.