టాలీవుడ్ లో మల్టీస్టారర్ల జాతర కొనసాగుతోంది. ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నారు. దర్శకులూ అలాంటి కథలపై దృష్టి పెడుతున్నారు. త్వరలో వెంకటేష్, రవితేజ కలిసి ఓ సినిమా చేయబోతున్నారన్నది టాలీవుడ్ టాక్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రూపొందించి, మల్టీస్టారర్ల శకానికి కొత్త ఊపిరి పోసిన శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని టాక్. వెంకటేష్ తో `నారప్ప` రీమేక్ తీసిన శ్రీకాంత్ అడ్డాల ఆ తరవాత ఎలాంటి సినిమా చేస్తాడన్న విషయంలో ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు. అయితే శ్రీకాంత్ దగ్గర `అన్నాయ్` అనే ఓ కథ ఉంది. ఇది మల్టీస్టారర్ కథ అని, పెద్ద హీరోలతో తీస్తానని శ్రీకాంత్ ఇది వరకే చెప్పాడు. చిరంజీవి - అల్లు అర్జున్‌లతో ఈ మల్టీస్టారర్ తెరకెక్కే అవకాశం ఉందన్నారు. మరి.. ఇప్పుడు వెంకటేష్, రవితేజల గురించి తయారు చేసిన కథ ఇదేనా? లేదంటే ఇది కొత్త కథా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
శ్రీకాంత్ కి చిరు, బన్నీలు ఛాన్స్ ఇవ్వడం దాదాపు అసాధ్యం. కాబట్టి... ఆ కథని... వెంకీ, రవితేజల కోసం మార్చి ఉంటాడని టాక్. శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేయడానికి గీతా ఆర్ట్స్ ఇది వరకే అడ్వాన్స్ ఇచ్చింది. సో... ఈ మల్టీస్టారర్ గీతా ఆర్ట్స్‌లో ఉండే అవకాశాలున్నాయి. ఈ సినిమా గురించిన అన్ని డిటైల్స్ త్వరలోనే అధికారికంగా తెలుస్తాయి.