కొన్ని కాంబినేషన్లను తెరపై చూసుకోవాలని.. అభిమానులు ఎంతగానో కలలు కంటుంటారు. కానీ.. ఆ కాంబినేషన్ సెట్ అయినట్టే అయ్యి, ఫట్ మంటుంటుంది. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ కూడా అలాంటిదే. `నువ్వు నాకు నచ్చావ్`, `మల్టీశ్వరి` సినిమాలు వెంకీ కెరీర్‌లో స్పెషల్ గా మిగిలిపోయాయి. ఈ సినిమాలకు ఇప్పటికీ మంచి టీఆర్పీ రేటింగులు వస్తుంటాయి. అయితే.. ఈ సినిమాలకు త్రివిక్రమ్ రచయితగా మాత్రమే పనిచేశాడు. త్రివిక్రమ్ దర్శకుడయ్యాక.. వీరి కాంబోలో ఓ సినిమా వస్తుందని ఆశించారంతా. కొన్ని సార్లు ఆ ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ సెట్ అవ్వలేదు.
వెంకీ 75వ సినిమాకి త్రివిక్రమ్ దర్శకుడు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఇవన్నీ పుకార్లే అని తేలిపోయింది. నిజానికి త్రివిక్రమ్ దగ్గర వెంకీకి సరిపడా ఓ కథ రెడీగా ఉంది. కానీ.. డేట్లే సర్దుబాటు కావడం లేదు. వెంకీకి ఖాళీ ఉన్నప్పుడు త్రివిక్రమ్ మరో ప్రాజెక్టుతో బిజీ. త్రివిక్రమ్ ఖాళీ ఉన్నప్పుడు వెంకీ చేతిలో సినిమా ఉంటోంది. ఇప్పుడు వెంకీ చేతిలో `నారప్ప`, `ఎఫ్ 3` ఉన్నాయి. అందుకే త్రివిక్రమ్ కి వీలున్నా - వెంకీతో సినిమా చేయలేకపోతున్నాడు. మరి ఈ కాంబో లో సినిమా ఎప్పుడు వస్తుందో? 2021లో అయినా ఈ కల నెరవేరుతుందేమో చూడాలి.