ఆగండాగండి 'అది' అంటే ఇంకేదో అనుకోకండి. ఆ అది కామెడీ. కామెడీలో వెంకటేష్ దిట్ట. ఈ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ కామెడీతోనే ఫ్యామిలీ ఆడియన్స్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది వెంకీకి. అయితే వరుణ్‌కి మాత్రం కామెడీ కొత్తనే చెప్పాలి. విభిన్న కథా చిత్రాల్లో నటించిన అనుభం, లవర్ బోయ్‌గా మెప్పించగల స్టామినా ఉన్నాయి వరుణ్‌లో. అయితే ఈ సారి తనలో దాగున్న కామెడీ యాంగిల్‌ని బయటికి తీయబోతున్నాడట. అదేనండీ, ఈ ఇద్దరూ కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు కదా.
అదే 'ఎఫ్ 2' అనే సినిమా. 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' అని దీనికి క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ సినిమా కోసమే మనం మాట్లాడుకునేది. ఈ సినిమాలో వెంకీ తనదైన మార్కు కామెడీని పండిస్తాడట. వెంకీతో పోటీ పడేలా వరుణ్ క్యారెక్టర్ ఉండబోతోందట. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కళ్యాణ్‌రామ్‌తోనే 'పటాస్' సినిమాలో బీభత్సమైన కామెడీని పండించేశాడీ డైరెక్టర్. అలాంటిది ఈ తరం కుర్రోడు వరుణ్‌తో ఇంకెంత ఫన్ జనరేట్ చేయిస్తాడో కదా.
'పటాస్', 'సుప్రీం', 'రాజా ది గ్రేట్' చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. వెంకీ - వరుణ్ ఈ కాంబోలో మల్టీ స్టారర్ అంటే ఒకింత ఆశక్తిగానే అనిపిస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతో ఆడియన్స్ దృష్టిని ఎలా తన వైపు ఆకర్షించేలా చేస్తాడో అనిల్ రావిపూడి. మరోవైపు వరుణ్, సంకల్ప్‌తో 'వ్యోమగామి' (వర్కింగ్ టైటిల్) సినిమాతో బిజీగా ఉన్నాడు. వెంకీ, తేజతో 'ఆటా నాదే వేటా నాదే' సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు.