వెంకటేష్‌కి రీమేక్ సినిమాలంటే ఎంత ప్రేమో..? తన కెరీర్‌లో రీమేకులేఎక్కువ. వాటి వల్లే హిట్లు పడ్డాయి. ఈమధ్య అయితే అసలు కొత్త కథల జోలికే వెళ్లడం లేదు. గోపాల- గోపాల, గురు, దృశ్యమ్, దృశ్యమ్ 2, నారప్ప.. ఇవన్నీ రీమేకులే. ఇప్పుడు వెంకీ దృష్టి మరో రీమేక్ పై పడిందని సమాచారం. మోహన్ లాల్ కథానాయకుడిగా రూపొందిన మలయాళ చిత్రం `బ్రో డాడీ`. పృథ్వీరాజ్ దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో `లూసీఫర్` వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు `బ్రో డాడీ` తీశారు. త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు టాక్.
బ్రో డాడీ ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఇదో తండ్రీ కొడుకుల కథ. కొడుకుని సోదరుడిలా చూసే ఓ తండ్రికథ. కొడుకు పెళ్లి కోసం ఓ తండ్రి ఎలాంటి అగచాట్లు పడ్డాడో ఇందులో చూపిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, పృథ్వీరాజ్ కొడుకు పాత్రలో నటించేశాడు. అందుకే ఈ కాంబోపై అంత క్రేజ్. మోహన్ లాల్ సినిమాల్ని తెలుగులో రీమేక్ చేయడం పనిగా పెట్టుకున్న వెంకీకి ఈ సినిమాపై దృష్టి పడింది. ఓ యంగ్ హీరోతో ఈ సినిమా చేస్తే గిట్టుబాటు అవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఆసినిమా రిజల్ట్ చూసి తెలుగులో రీమేక్ చేయాలా, వద్దా? అనే నిర్ణయం తీసుకోనున్నారు.