అతడు... మహేష్‌బాబు - త్రివిక్రమ్ కాంబో చేసిన మాయాజాలం. అప్పట్లో బాక్సాఫీసు దగ్గర పెద్దగా వసూళ్లు సాధించలేదు కానీ, ఆ తరవాత కల్ట్ క్లాసిక్‌గా మారిపోయింది. ఇప్పటికీ.. ఈ సినిమా వస్తోందంటే టీవీలకు అతుక్కుపోతుంటారు జనాలు. ఈ సినిమాలో మహేష్ తరవాత.. అంతగా గుర్తుండిపోయే పాత్ర సోనూసూద్ ది. అతడు సినిమా సోనూకి లైఫ్ ఇచ్చింది. నిజానికి ఈ పాత్ర కోసం ముందు ఓ హీరోని అనుకొన్నార్ట. కానీ ఆ హీరో `నో` చెప్పడంతో.. ఆ అవకాశం సోనూకి వెళ్లింది. సోనూసూద్ పాత్రని వదులుకొన్న హీరో ఎవరో కాదు.. వేణు తొట్టెంపూడి.
వేణుకీ - త్రివిక్రమ్‌కీ మంచి అనుబంధం ఉంది. వేణు తొలి సినిమా స్వయం వరం చిత్రానికి త్రివిక్రమే రచయిత. తన తొలి సినిమా కూడా అదే. ఆ తరవాత చిరునవ్వుకీ పనిచేశాడు. ఆ తరవాత త్రివిక్రమ్ పెద్ద దర్శకుడైపోయాడు. కానీ వేణు కి తన సినిమాలో మాత్రం ఆఫర్ ఇవ్వలేదు. కాకపోతే.. 'అతడు'లో సోనూసూద్ పాత్ర కోసం ముందు వేణునే అడిగాడు త్రివిక్రమ్. కానీ.. అప్పట్లో కాల్షీట్లు సర్దుబాటు చేయలేక వేణు దాన్ని వదులుకొన్నాడు. చివరికి సోనూని తీసుకొన్నారు. ఈ విషయాన్ని వేణు చెప్పుకొచ్చాడు. ''త్రివిక్రమ్ తో నాకు ఇప్పటికీ మంచి అనుబంధమే ఉంది. అతడులో నాకు అవకాశం ఇచ్చారు. కానీ కుదర్లేదు.. నాకు తగిన పాత్ర ఉందనిపిస్తే తను తప్పకుండా నన్ను పిలుస్తాడు'' అని చెప్పుకొచ్చాడు వేణు.