నీదీ నాదీ ఒకే కథతో విమర్శకుల్ని మెప్పించాడు వేణు ఉడుగుల. ఆ వెంటనే విరాటపర్వంతో బంపర్ ఛాన్స్ కొట్టాడు. సాయి పల్లవి, రానా, సురేష్ ప్రొడక్షన్.. మొత్తానికి రెండో సినిమాకి ఇది పెద్ద వెంచరే. ఈ సినిమాపై ముందు నుంచీ పాజిటీవ్ బజ్ గట్టిగా వినిపించేది. దాంతో.. మూడో సినిమా కోసం అడ్వాన్సులు గట్టిగానే అందుకొన్నాడు వేణు. ఓవైపు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి, మరో వైపు మైత్రీ మూవీస్ నుంచి.. వేణుకి అడ్వాన్సులు అందాయి. మైత్రీ వాళ్లు చిరంజీవితో కథ ఓకే చేయిస్తామని మాటిచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అయితే పవన్ కల్యాణ్‌ని తీసుకొస్తామని చెప్పాయి. రెండూ పెద్ద ప్రాజెక్టులే. ఎవరు సెట్ అయినా... ముచ్చటగా మూడో సినిమాతో పెద్ద లీగ్ లోకి చేరిపోవడం ఖాయం.
అయితే వేణు ఉడుగుల ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇటీవల విడుదలైన విరాటపర్వంకి మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా బాగానే ఉంది అంటున్నారంతా. కానీ.. బాక్సాఫీసు దగ్గర వసూళ్లు లేవు. ఆర్థికంగా ఈ సినిమా నిలదొక్కుకొనే ఛాన్స్ లేదు. దర్శకుడిగా వేణు తన సత్తా చూపించినా, అది సరిపోలేదు. పెద్ద హీరోలతో సినిమా డీల్ చేసే సామర్థ్యంపై ఇప్పుడే ఓ అంచనాకు రావడం కష్టం. సో.. చిరు, పవన్ ల సినిమాలపై ఆశల్ని వేణు వదులుకోవాల్సిందే. అయితే వేణు దగ్గర ప్లాన్ బి ఉందట. ఓ యువ హీరో కోసం ఓ కథ సిద్ధం చేసుకొన్నాడట. అదైతే.. అటు మైత్రీ గానీ, ఇటు సితార గానీ ఎంత వీలైతే అంత త్వరగా పట్టాలెక్కించేయొచ్చు. సో.. మూడో సినిమాతో అయినా వేణు కమర్షియల్ దర్శకుడు అనిపించుకుంటే, అప్పుడు పెద్ద హీరోల దృష్టిని తన వైపునకు తిప్పుకోవచ్చు.