ఈమధ్య సమంత మనసులో ఏదీ ఉంచుకోవడం లేదు. సోషల్ మీడియాలో తనని ట్రోల్ చేస్తున్నవాళ్లకు అంతే స్ట్రాంగ్ గా సమాధానం ఇస్తోంది. సమంత స్పీడు చూసి - ఆమెని టార్గెట్ చేయడానికే భయపడిపోతున్నారు జనాలు. ఇప్పుడు సమంత దూకుడు ఏపాటిదో మరోసారి స్పష్టమైంది.
నాగచైతన్య ఓ హీరోయిన్‌తో సన్నిహితంగా ఉంటున్నట్టు ఇటీవల వార్తలొస్తున్నాయి. చైతూ మంచివాడని, కావాలనే సమంత పీఆర్వోలు చైతూని టార్గెట్ చేస్తూ, ఇలాంటి ఫేక్ వార్తలు పుట్టిస్తున్నారని, చైతూపై వస్తున్న రూమర్ల విషయంలో సమంత ప్రమేయం ఉందంటూ... ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై సమంత గట్టిగా స్పందించింది.
``అమ్మాయిపై వదంతులు వస్తే అవి నిజమే అనుకుంటారు. అదే అబ్బాయిపై వస్తే.. అవన్నీ అమ్మాయిలే చేయించారనుకొంటారు. అబ్బాయిలూ మీరు ఎదగండి. మీ కుటుంబంపై దృష్టి పెట్టండి. ఈ విషయంలో ప్రమేయం ఉన్న ఇద్దరూ తమ తమ పనుల్లో ఉన్నారు. మీరు కూడా మీ పనుల్లో ఉండండి`` అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఇదంతా చైతూ గురించి వస్తున్న రూమర్లపై సమంత నుంచి వచ్చిన రియాక్షన్. అయితే తన రిప్లైలో ఎక్కడా చైతూ పేరు రాకుండా జాగ్రత్త పడింది.
చైతన్య ఓ హీరోయిన్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని, ఇద్దరూ పార్టీలు చేసుకుంటున్నారని.. సమంతని మర్చిపోవడానికే చై ఈ కొత్త బంధాన్ని వెదుక్కొన్నాడని వార్తలొస్తున్నాయి. వాటిపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సమంత ఇలా స్పందించడంతో ఈ వార్తలకు మరింత ఊతం ఇచ్చినట్టైంది.