నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఎన్టీఆర్ బయోపిక్' అంచనాల్ని అందుకోలేకపోయినా, ఆ సినిమాలో బాలకృష్ణ - బాలీవుడ్ నటి విద్యా బాలన్ మధ్య కెమిస్ట్రీ బీభత్సంగా వర్కవుట్ అయ్యింది. విద్యా బాలన్ దేశం మెచ్చిన గొప్ప నటి. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఆమె చాలా సెలక్టివ్‌గా మాత్రమే సినిమాలు చేస్తుంటుంది. ఇప్పుడామె పేరు మళ్ళీ వార్తల్లోకెక్కుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, విద్యాబాలన్‌తో ఓ స్పెషల్ రోల్ చేయించాలని దర్శకుడు బోయపాటి శ్రీను భావిస్తున్నాడట.
బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం ఇప్పటికే విద్యాబాలన్‌తో సంప్రదింపులు షురూ అయ్యాయంటూ టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయమై ఇంతవరకు చిత్ర యూనిట్ వర్గాలు పెదవి విప్పలేదు. బాలయ్య సరసన సయ్యేసా సైగల్ ('అఖిల్' ఫేం) హీరోయిన్‌గా ఇప్పటికే ఖరారైన విషయం విదితమే. అయితే, ఆమెను ఇంకో హీరోయిన్‌తో రీప్లేస్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. హీరోయిన్ విషయమై ఇంత గందరగోళం బాలయ్య కెరీర్‌లో ఇంతవరకు ఎప్పుడూ లేదేమో.
కరోనా నేపథ్యంలో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. దాంతో, చాలా సినిమాలకు ఇలాంటి గందరగోళం ఎదురవుతోంది. ఇక, విద్యాబాలన్ విషయానికొస్తే, తెలుగు సినిమాల్లో నటించడానికి ఈ బ్యూటీ ప్రత్యేకమైన ఆసక్తి చూపుతోంది. అలాగని, వచ్చిన ఆఫర్స్ అన్నిటినీ ఒప్పేసుకునే రకం కాదు విద్యాబాలన్.